
వంద రైల్వే స్టేషన్లకు వై-ఫై: సుందర్ పిచాయ్
భారతదేశంలోని వంద రైల్వే స్టేషన్లకు 2016 డిసెంబర్ నాటికల్లా వై-ఫై సదుపాయం కల్పిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. భారతదేశ పర్యటనలో ఉన్న ఆయన మీడియా, డెవలపర్లు, పారిశ్రామికవేత్తలు, మార్కెటింగ్ నిపుణులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో ఇంటర్‌నెట్ వాడకాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పిచాయ్ పర్యటన సాగుతున్నట్లు తెలుస్తోంది. సామాన్యుడి చెంతకు కూడా టెక్నాలజీని తీసుకెళ్లాలన్నది పిచాయ్ వ్యూహమని చెబుతున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా ఐదు అంశాలను ప్రస్తావిస్తున్నారు.
1) భారతదేశంలోని వంద రైల్వే స్టేషన్లలో రైల్‌టెల్ సహకారంతో 2016 డిసెంబర్ నాటికల్లా వై-ఫై సేవలు
2) మూడేళ్లలో భారతదేశంలోని 3 లక్షల గ్రామాల్లో మహిళలకు ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించేందుకు గూగుల్ సాయం
3) భారతదేశం కోసం ఉత్పత్తులు తయారుచేసేందుకు హైదరాబాద్‌లో 'ఇంజనీరింగ్ ప్రెజెన్స్'ను పెంచడం
4) 11 భాషల్లో టైప్ చేసేందుకు ఉపయోగపడే గూగుల్ 'ఇండిక్' కీబోర్డు
5) 2016 నుంచి గూగుల్ సెర్చ్ ద్వారా లైవ్ క్రికెట్ అప్‌డేట్లు