న్యూఢిల్లీ: ఆకాశంలో రేపు అత్యంత అరుదైన ఖగోళ అద్భుతం చోటుచేసుకోనుంది. ఈ నెల 31న సూపర్‌మూన్‌గా మారే చంద్రుడు బ్లూమూన్, బ్లడ్‌మూన్‌గానూ దర్శనమివ్వనున్నాడు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఈ అద్భుతం జరగనుందనీ, మరో పదేళ్ల తర్వాత కానీ ఇలాంటి అవకాశం రాదని శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఈ ఖగోళ వింతను కెమెరాల్లో బంధించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కన్పిస్తాడు. దీన్నే సూపర్‌మూన్‌గా వ్యవహరిస్తారు. ఓ నెలలో రెండో పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే దాన్ని బ్లూమూన్‌గా పిలుస్తారు.
ఇక చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి నీడలోకి చేరినప్పుడు.. భూమి వాతావరణంలోకి వచ్చిన సూర్యకాంతి పరావర్తనం చెంది చంద్రుడిపైకి ప్రసరిస్తుంది. ఎక్కువ తరంగదైర్ఘ్యమున్న ఎరుపు రంగు కిరణాలు చంద్రుడ్ని చేరడంతో చందమామ రుధిర వర్ణంలో ప్రకాశిస్తాడు. దీన్నే బ్లడ్‌మూన్‌గా వ్యవహరిస్తారు. 1866 తర్వాత ఈ మూడు ఖగోళ అద్భుతాలు ఒకేసారి సంభవించడం ఇదే తొలిసారి. భారత్‌లో బుధవారం సాయంత్రం 4.21 గంటల సమయంలో పాక్షికంగా చంద్ర గ్రహణం మొదలు కానుంది. సాయంత్రం 6.21 గంటల నుంచి 7.37 గంటల వరకూ బ్లూ, బ్లడ్‌మూన్ చూడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం 76 నిమిషాల పాటు కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment