నేడే సూపర్‌ బ్లూ బ్లడ్‌ మూన్‌ | Today is the Super Blue Blood Moon | Sakshi
Sakshi News home page

నేడే సూపర్‌ బ్లూ బ్లడ్‌ మూన్‌

Published Wed, Jan 31 2018 1:27 AM | Last Updated on Wed, Jan 31 2018 6:57 AM

Today is the Super Blue Blood Moon - Sakshi

న్యూఢిల్లీ: సుమారు 150 ఏళ్ల తర్వాత ఆకాశంలో నేడు ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. సూపర్‌మూన్, బ్లూమూన్, సంపూర్ణ చంద్రగ్రహణం మూడు కలసి కనువిందు చేయబోతున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా భూమి పూర్తిగా నీడలోనే ఉండిపోనుండటంతో జాబిల్లి ముదురు ఎరుపురంగులో (బ్లడ్‌మూన్‌గా) కనిపించనుంది.

సాయంత్రం 4.21 గంటలకు ప్రారంభమై రాత్రి 7.37 గంటల వరకు ఆసియా, తూర్పు రష్యా, మధ్య ప్రాచ్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ ఖగోళ వింత చోటుచేసుకోనుంది. అమెరికా పశ్చిమ ప్రాంతంలో ఇది మరింత బాగా కనపడవచ్చు.  

భారత్‌ వ్యాప్తంగా...
మన దేశంలోనూ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చందమామపై పాక్షిక నీడ లేదా భూమికి చెందిన పెన్యుంబ్రా నీడతో ఇది భారత్‌లో సాయంత్రం 5.20కి ప్రారంభమవుతుంది. ప్రధాన గ్రహణం మాత్రం సూర్యాస్తమయం తర్వాత  6.25 నిమిషాలకు ప్రారంభమై, తూర్పు వైపు ఆకాశంలో కనిపిస్తుంది.

ఆ తర్వాత జాబిల్లి వెండి రంగులోకి మారుతుంది. కొన్ని నిమిషాల తరువాత మొత్తం నీడ పరచుకుంటుంది. రాత్రి 7.25 గంటల నుంచి దాని పరిమాణం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. దీనిని నెలలో రెండో నిండుపున్నమి లేదా నీలవర్ణ చంద్రుడిగా (బ్లూమూన్‌)గా పిలుస్తారు(జనవరి 1న తొలి పౌర్ణమి ఏర్పడింది). బ్లూమూన్‌ సందర్భంగా నదులు, సముద్రాల్లో అలలు కొంచెం ఎత్తులో ఎగిసిపడతాయని, దీని వల్ల భయపడాల్సిందేమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సూపర్‌మూన్‌...
చంద్రుడు గుండ్రంగా ఒక స్థిరకక్ష్యలో కాకుండా కొంచెం అటూ ఇటూగా (అప్సిడల్‌ ప్రిసిషన్‌)లో భ్రమిస్తుండటంతో కొన్ని పర్యాయాలు భూమికి కొంత సమీపంగా వస్తాడు. ఇలాంటి సందర్భాల్లో... పున్నమి రోజుల్లో సూర్యుడికి ఎదురుగా వస్తాడు. ఈ కారణంగా చంద్రుడి పరిమాణం పెరిగినట్లుగా అనిపిస్తుంది.

ఈ విధంగా పౌర్ణమినాడు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు ‘సూపర్‌మూన్‌’ అని పిలుస్తారు. భూమండలానికి సమీపంగా రావడం వల్ల చంద్రుడు కొంచెం పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సాధారణంగా కనిపించే జాబిల్లితో పోల్చితే ఇది 30 శాతం పెద్దదిగా, రోజు కనిపించే దాని కంటే 14 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడని సైంటిస్టులు వెల్లడించారు.  

ఆకాశంలో చోటుచేసుకునే ఈ అరుదైన అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రత్యేకమైన బైనాక్యులర్లు, టెలిస్కోప్‌ల అవసరం లేదని, మామూలుగా అందరూ చంద్రుడిని చూసినట్టే ఎలాంటి ఉపకరణాలు లేకుండా చూడొచ్చునని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరో సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చే జూలై 27న ఏర్పడనుందని, అది బ్లూ లేదా సూపర్‌మూన్‌ మాత్రం కాదని వారు తెలిపారు.  


ఎప్పుడు, ఎక్కడెక్కడ...
తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో సూపర్‌ బ్లూబ్లడ్‌ మూన్‌ను ముందుగా వీక్షించొచ్చు. హైదరాబాద్‌ ప్రజలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మొత్తం చూసే అవకాశముంది. దేశవ్యాప్తంగా అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు కోల్‌కతా ప్రజలు ఈ అద్భుతాన్ని అందరికన్నా ముందు చూడొచ్చు. చంద్రోదయం..అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లో సాయంత్రం 4.47 గంటలకు, కోల్‌కతా–5.16, పట్నా–5.25, ఢిల్లీ–5.53, చెన్నై–6.04, ముంబై–6 గంటల 27 నిమిషాలకు జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement