28న చంద్రగ్రహణం, సూపర్‌మూన్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే సోమవారం తెల్లవారుజామున ఆకాశంలో ఓ అరుదైన అద్భుతం జరగనుంది. ఆ రోజున భూమికి అతిదగ్గరగా చంద్రుడు రావడంతోపాటు అదే సమయంలో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రజలకు కనువిందు చేయనుంది. ఇలాంటి ఘటన దాదాపు 33 ఏళ్ల క్రితం..1982లో ఒకసారి జరిగింది. మళ్లీ 2033 ఏడాది వరకూ సంభవించే వీలు లేదు. 28వ తేదీ ఉదయం గం. 5.40లకు ప్రారంభమయ్యే గ్రహణం గం.10.53కు ముగుస్తుంది. గం. 6.37 నుంచి గం.9.57ల మధ్య ఉంబ్రల్ దశ (చంద్రుడు పూర్తిగా భూమి ఛాయలోకి చేరిపోవడం) నడుస్తుంది.
అయితే ఈ గ్రహణం భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే వీలుందని ప్లానెటరీ సొసైటీ, ఇండియా డెరైక్టర్ శ్రీరఘునందన్ తెలిపారు. పూర్తిస్థాయిలో కనిపించే చోట వాతావరణ పరిస్థితులను బట్టి చంద్రుడు నారింజ లేదా ఎరుపు వర్ణంలో కనిపిస్తాడు. ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం కావడం విశేషం.
ఏడాదికి మూడు నాలుగుసార్లు....
భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో చంద్రుడు తిరుగుతాడు. కక్ష్యలో తిరుగుతూ చంద్రుడు రెండుసార్లు భూమికి అతిదగ్గరగా, ఇంకో రెండుసార్లు అతిదూరంగా వస్తాడు. భూమికి, చంద్రుడికి మధ్య సగటు దూరం 3.84 లక్షల కిలోమీటర్లు కాగా...28న ఈ దూరం దాదాపు 50,000 కి.మీ.లు తగ్గనుంది. ఫలితంగా ఆ రోజున చంద్రుడి సైజు పెరిగినట్టుగా కనిపిస్తుంది. మామూలు రోజుల్లో కంటే ఆ రోజు చంద్రుడి పరిమాణం 14 శాతంఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. అందుకే దీన్ని కొందరు సూపర్‌మూన్‌గా వ్యవహరిస్తారు. శాస్త్రవేత్తలు దీన్ని అరుదైన చంద్రగ్రహణంగా పరిగణిస్తారు.