మహిళలను ప్రశాంతంగా బతకనివ్వరా?
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిని ప్రశాంతంగా బతకనివ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఈ దేశంలో మహిళలు ప్రశాంతంగా ఎందుకు జీవించలేకపోతున్నారు?’ అని ప్రశ్నించింది.
వేధింపులకు పాల్పడి, ఓ 16 ఏళ్ల బాలికను ఆత్మహత్యకు పురిగొల్పిన కేసులో తనకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వేసిన ఏడేళ్ల జైలు శిక్షను సవాలు చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళను ఫలానా వ్యక్తిని ప్రేమించాలని బలవంతం చేయజాలరంది. మృతురాలి మరణ వాంగ్మూలంపై అనుమానాలు ఉన్నాయని దోషి న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఆమె ఆత్మహత్యకు పాల్పడే స్థితిని సృష్టించింది మీరేనంటూ దోషిని ఆక్షేపిస్తూ తీర్పు వాయిదా వేసింది.