న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీకి తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి..ఏ తేదీల్లో ఎన్నికలు జరపాలీ అనేది ఎన్నికల సంఘమే చూసుకుంటుందని సుప్రీం వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలంటూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.
ఆ నివేదికను యథాతథంగా కేంద్ర కేబినెట్ ఆమోదించి...రాష్ట్రపతికి పంపింది.దాంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో ఆ ఎన్నికల తర్వాత ఢిల్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి నిరుడు డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షమైన అకాలీదళ్‌కు వచ్చిన ఒక స్థానాన్ని కలుపుకొని బీజేపీ 32 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆప్‌కు 28 స్థానాలు రాగా కాంగ్రెస్‌కు 8 లభించాయి. కొంత ఊగిసలాట తర్వాత అదే నెలలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైనా అది రెండు నెలలుకూడా మనుగడ సాధించలేకపోయింది. పదవి నుంచి వైదొలగుతూ కేజ్రీవాల్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు.