
ప్రజల చావు కోసం ఎదురుచూస్తున్నారా?
రాష్ట్రాలపై సుప్రీం కోర్టు మండిపాటు
న్యూఢిల్లీ: విపత్తు నిర్వహణ సన్నద్ధత కోసం రాష్ట్రాలు సలహా కమిటీల ఏర్పాటు చేయకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల చావు కోసం ఎదురుచూస్తున్నారా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రాలు కమిటీ లు ఏర్పాటు చేశాయో? లేదో? తమకు తెలియదని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) కోర్టుకు చెప్పడంతో జస్టిస్ ఎంబీ లోకూర్, దీపక్ గుప్తాల ధర్మాసనం గురువారం తీవ్రస్థాయిలో మండిపడింది. దేనికోసం ఎదురుచూస్తున్నారు? సలహా కమిటీల్ని ఏర్పాటు చేయమని రాష్ట్రాల్ని ఎందుకు అడగరు? అంటూ ప్రశ్నించింది. రాష్ట్రాలకు లేఖలు పంపినా సమాధానం రాలేదని, అందువల్ల ఎలాంటి సమాచారం లేదని ఎన్‌డీఎంఏ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందిం చకపోవడంపై సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
లోక్‌పాల్ జాప్యం సమర్థనీయం కాదు
లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013 అమలును జాప్యం చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘ప్రస్తుతానికి ప్రతిపక్ష నేత లేకపోయినా.. చైర్‌పర్సన్, ఇద్దరు సెలక్షన్ కమిటీ సభ్యులు (లోక్‌సభ స్పీకర్, సీజేఐ) కలిసి లోక్‌పాల్ చట్టంలోని సెక్షన్ 4 (1)(ఈ) ప్రకారం సెలక్షన్ కమిటీలో ప్రముఖ న్యాయ నిపుణుడిని సభ్యుడిగా నియమించవచ్చు’ అని కోర్టు తెలిపింది. కమిటీలో ఖాళీ కారణంగా నియామకం ఆగిపోకూడదని స్పష్టం చేసింది.