న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ శాసనసభలో రేపే(శుక్రవారం) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని సుప్రీంకోర్టులో బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సింగిల్ పాయింట్ ఎజెండాతో బలపరీక్ష జరపాలని స్పీకర్‌ను ఆదేశించింది. అదేవిధంగా బలపరీక్ష నిర్వహణను వీడియో తీయాలని పేర్కొంది. బలపరీక్ష సమయంలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, నిబంధనలు ఉల్లంఘించకుండా అసెంబ్లీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచనలు ఇచ్చింది.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేతులు పైకి ఎత్తడం ద్వారా బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా రేపు(శుక్రవారం) సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష పక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఇటీవల 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో బీజేపీ గూటికి చేరడంతో కమల్‌నాథ్ సర్కార్ సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. ‘బలపరీక్షపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. శుక్రవారం జరపబోయే బలపరీక్షలో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోతుంది. ఎందుకంటే కమల్‌నాథ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు’ అని శివరాజ్‌సింగ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment