
చీఫ్ జస్టిస్ చేతుల్లో '377 సెక్షన్'
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీలోని 377 సెక్షన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ థాకూర్ నిర్ణయం తీసుకోనున్నారు. 377 సెక్షన్ ను కొట్టేయాలంటూ కొందరు ప్రముఖులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ఇదే అంశంపై దాఖలైన క్యురేటివ్ పిటిషన్ ఐదుగురు జడ్జిల బెంచ్ ముందు పెండింగ్ లో ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ టీఎస్ థాకూర్ నేతృత్వంలోని బెంచ్ దీనిపై బహిరంగ విచారణకు అంగీకరించిందని గుర్తు చేసింది.
లైంగిక హక్కులు ప్రాథమిక హక్కుల్లో భాగమని, తమ హక్కులకు రక్షణ కల్పించాలని ఎల్‌జీబీటీ వర్గానికి చెందిన చెఫ్ రితూ దాల్మియా, హోటలియర్ అమన్ నాథ్, డ్యాన్సర్ ఎన్‌ఎస్ జోహర్ రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. వివిధ రంగాల్లో దేశానికి ఎంతో సేవ చేశామని, తమ లైంగిక హక్కును కాలరాస్తున్నారని, 377 సెక్షన్ తమని నేరస్తులుగా పేర్కొంటోందన్నారు.