వాటికన్ సిటీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఆ చట్టాలు పూర్తిగా అనైతికమైనవి. స్వలింగ సంపర్కం నేరం కాదు. దేవుడు తన పిల్లలందరినీ సమానంగా, బేషరతుగా ప్రేమిస్తాడు’’ అని అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘‘స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను కొందరు క్యాథలిక్ బిషప్‌లు కూడా సమర్థిస్తున్నారని నాకు తెలుసు.
కానీ నా విజ్ఞప్తల్లా ఒక్కటే. స్వలింగ సంపర్కుల పట్ల కాస్త మృదువుగా వ్యవహరించాలి. వారిని కూడా చర్చిల్లోకి అనుమతించాలి. వారిని స్వాగతించి గౌరవించాలి తప్ప వివక్ష చూపి అవమానించరాదు’’ అని ఆయన సూచించారు. అయితే, స్వలింగ సంపర్కం పాపమేనని పోప్ పేర్కొనడం విశేషం. ‘‘ఇది ఒక దృక్కోణం. కాకపోతే ఈ విషయంలో సాంస్కృతిక నేపథ్యాలు తదితరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే ఇతరులపై జాలి, దయ చూపకపోవడమూ పాపమే. కాబట్టి నేరాన్ని, పాపాన్ని విడిగానే చూడటం అలవాటు చేసుకుందాం’’ అన్నారు.
క్యాథలిక్ బోధనలు స్వలింగ సంపర్కాన్ని తప్పుడు చర్యగానే పేర్కొంటున్నా స్వలింగ సంపర్కులను కూడా ఇతరులతో సమానంగా గౌరవించాలని చెబుతాయి. క్యాథలిక్ చర్చి ప్రకారం స్వలింగ వివాహాలు నిషిద్ధం. దాదాపు 67 దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. వీటిలోనూ 11 దేశాల్లో ఇందుకు మరణశిక్ష కూడా విధించే ఆస్కారముందని ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ఉద్యమిస్తున్న హ్యూమన్ డిగ్నిటీ ట్రస్ట్ పేర్కొంది. అమెరికాలో కూడా 12కు పైగా రాష్ట్రాలు దీన్ని నేరంగానే పరిగణిస్తున్నాయి. ఇలాంటి చట్టాలను రద్దు చేయాలని ఐక్యరాజ్యసమితి కూడా ప్రపంచ దేశాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment