సాక్షి, న్యూఢిల్లీ : అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా అసంతృప్తి ఎమ్మెల్యేల పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయకుండా రాజస్తాన్ హైకోర్టును నిలువరించలేమని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై విచారణను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదలాయించాలని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి స్వరాలను అణిచివేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంటూ పైలట్ సహా 19 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసుల జారీకి కారణాలను వివరించాలని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీని వివరణ కోరింది.
అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో పాటు సొంత ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నారని స్పీకర్ జోషి తరపున వాదనలు వినిపిస్తూ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టుకు నివేదించారు. ఇది మామూలు విషయయం కాదని..ఈ ఎమ్మెల్యేలు ఎన్నికైన ప్రజా ప్రతినిధులని ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత ప్రక్రియ అనుమించదగినదా..కాదా అనేది నిర్దారించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ ఎమ్మెల్యేలు హరియాణాలో హోటల్‌లో గడుపుతూ మీడియాకు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారని....వారు ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవాలని కోరుతున్నారని కపిల్ సిబల్ కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ దశలో అనర్హత నోటీసులపై కోర్టులు జోక్యం చేసుకోజాలవని వాదించారు. కాగా సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 24న ఉత్తర్వులు జారీ చేసే వరకూ వారిపై అనర్హత ప్రక్రియను చేపట్టరాదని రాజస్తాన్ హైకోర్టు ఈనెల 21న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ జోషీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చదవండి : అనర్హతపై కోర్టు జోక్యమా!
Comments
Please login to add a commentAdd a comment