న్యూఢిల్లీ: ఇదొక అరుదైన సందర్భం. విచారణ పదేళ్లపాటు ఆలస్యమైనందుకు భారత అత్యున్నత న్యాయస్థానం ఒక మహిళకు క్షమాపణ తెలిపింది. ఝార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకే కేసులో పరస్పర విరుద్ధ తీర్పులు ఇవ్వడం వల్ల మొత్తం వ్యవహారం గందరగోళంగా మారిందని పేర్కొంది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తరాఖండ్ నగరం రూర్కీకి చెందిన శ్యామ్‌లత.. తన సోదరులు పత్రాలను ఫోర్జరీ చేసి తన దుకాణాన్ని ఆక్రమించుకున్నారని స్థానిక కోర్టుకు 2004లో ఫిర్యాదు చేశారు. ఈమె సోదరుల్లో ఒకరు కూడా అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ దుకాణం ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరారు. దీనిపై దర్యాప్తు జరపాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. అద్దె రశీదులపై ఉన్న సంతకాలు లతవేనా కావా అనే విషయాన్ని నిర్ధారించడం కోసం సంతకాల నిపుణుడి అభిప్రాయం కోరడానికి అనుమతి ఇవ్వాలని దర్యాప్తు అధికారి కోరారు. ఇందుకు న్యాయస్థానం సమ్మతించింది. అయితే సంతకాల నిపుణుడు కోర్టుకు రాగా, సంతకాలను ఫొటో తీసుకోవడానికి న్యాయమూర్తి తిరస్కరించారు. దీనిపై లత సెషన్స్ కోర్టుకు ఫిర్యాదు చేయగా, న్యాయమూర్తి సంతకాల సేకరణకు అనుమతిస్తూ కేసు రికార్డు జ్యుడీషియల్ మెజిస్ట్రేటుకు పంపారు.
సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లత సోదరుడు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించగా, లత కూడా ఇదే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మొదటి కేసులో లత అనుకూలంగా తీర్పు ఇస్తూ సంతకాల నిపుణుడిని తీసుకురావాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. సోదరుడి పిటిషన్‌పై స్పందిస్తూ జ్యుడీషియల్ కోర్టు నిర్ణయాన్ని తిరస్కరించింది. మళ్లీ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కేసు 2009లో సుప్రీంకోర్టుకు రాగా, మొదటి తీర్పునే సమర్థించింది. అయితే కేసు వేసిన కొన్ని రోజులకే లత మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment