విద్యార్థులను ముంచిన ‘విద్యా మండలి’
* సుప్రీంలో రెండో విడత కౌన్సెలింగ్‌ను ప్రస్తావించని ఉన్నత విద్యా మండలి
* అదే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థుల పాలిట శాపం
* మలి విడత కౌన్సెలింగ్, మేనేజ్‌మెంట్ కోటా భర్తీకి గడువు పొడిగించాలన్న వినతిని తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
* తీర్పు ప్రకారం అడ్మిషన్ల గడువు గత నెల 31తో పూర్తి
* అగమ్యగోచరంలో తొలి విడతలో సీటు దక్కని 4 వేల మంది
* బ్రాంచ్ మార్చుకునే వారికీ అవకాశం లేదు
* మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీపైనా స్పష్టత కరువు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఉదాసీనత ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యనభ్యసించాలనుకున్న విద్యార్థుల విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రెండో విడత కౌన్సెలింగ్‌కు అవకాశం లేకుండా చేసింది. మలి విడత కౌన్సెలింగ్, మేనేజ్‌మెంట్ కోటా భర్తీకి గడువు పొడిగించాలన్న ఉన్నత విద్యామండలి వినతిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు అలస్యం కాకుండా సుప్రీంకోర్టు 2012 డిసెంబరు 13నే సాంకేతిక విద్యకు క్యాలండర్‌ను రూపొందించింది. కళాశాలలు ఏఐసీటీఈ అనుమతికి దరఖాస్తు చేసుకోవడం నుంచి తరగతుల ప్రారంభం వరకు స్పష్టమైన షెడ్యూల్‌ను రూపొందించింది. దానిని ఏఐసీటీఈ నోటిఫై చేసింది. దానిప్రకారం ఏటా జూలై 31లోగా అడ్మిషన్లు పూర్తవ్వాలి.
ఆగస్టు 1న తరగతులు ప్రారంభమవ్వాలి. మిగిలిపోయిన సీట్లను ఆగస్టు 15లోగా భర్తీ చేయాలి. ఆ తర్వాత అడ్మిషన్లు చేపట్టకూడదు. దీని ప్రకారం ఈ ఏడాది కూడా అడ్మిషన్లు జరగాలి. అయితే విభజన నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిందని, అధికారుల కేటాయింపు పూర్తి కాలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొత్తగా విధివిధానాలు రూపొందిం చాల్సి ఉందని, అందువల్ల కౌన్సెలింగ్ పూర్తిచేసేందుకు అక్టోబరు 31 వరకు గడువు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇందులో తాము ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని ఏపీ ఉన్నత విద్యామండలి కోరింది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా అడ్మిషన్లు త్వరితగతిన పూర్తిచేయాల్సి ఉందని, ఆగస్టు 31 వరకు గడువు పొడిగిస్తే సరిపోతుందని విన్నవించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వమూ సరేనంది. దాంతో సుప్రీంకోర్టు అడ్మిషన్ల ప్రక్రియ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. దీని ప్రకారం తొలి విడత కౌన్సెలింగ్ గత నెల 31లోపు పూర్తయింది.
అయితే, ఆగస్టు 4 నాటి విచారణ సందర్భంగా రెండో విడత కౌన్సెలింగ్ విషయాన్ని ప్రస్తావించలేదు. తొలి విడత కౌన్సెలింగ్‌లో కొందరు విద్యార్థులు వివిధ కారణాల వల్ల సీట్లు పొందలేకపోవచ్చు. సీట్లు పొందిన వారు కూడా బ్రాంచ్, కాలేజి నచ్చక వాటిలో చేరకపోవచ్చు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరైన వారిలో 4 వేల మందికి సీటు రాలేదు. వీరికి రెండో విడత కౌన్సెలింగ్ కూడా లేకుండాపోయింది. అలాగే తొలి విడతలో సీటు పొందినా, ఆ బ్రాంచ్ నచ్చకో, మంచి కాలేజీకోసమో కళాశాలల్లో రిపోర్ట్ చేయని వారూ రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
వీరికీ ఇప్పుడు న్యాయం జరిగే పరిస్థితి లేదు. అంతేగాక విద్యార్థులు వదిలేసిన సీటును కళాశాలలు మరొకరికి ఇవ్వలేని పరిస్థితీ ఎదురవుతుంది. దానిని మేనేజ్‌మెంట్ కోటాగా మార్చుకున్నా.. దాని గడువూ గత నెల 31తో ముగిసింది. కీలకమైన ఇలాంటి సాంకేతిక అంశాలను ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టులో ప్రస్తావించనే లేదు. 65 వేల సీట్లు మిగిలిపోయాయన్న ధ్యాసే తప్ప, విద్యార్థులు నష్టపోతున్న విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించలేదు. వాదనలూ వినిపించలేదు. ఆగస్టు 4 నాటి విచారణకు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్, రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. వారు ఆనాడే ఈ విషయం ప్రస్తావించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు.
మేనేజ్‌మెంట్ కోటా పరిస్థితేమిటి?
బి- కేటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) సీట్ల భర్తీకి ఏపీ ఉన్నత విద్యామండలి గత నెల 22న నోటిఫికేషన్ జారీచేసింది. వ్యక్తిగతంగా లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఈనెల 3లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చంది. ఈ నెల 5న మెరిట్ జాబితా, 7న ఎంపికైన వారి జాబితాలు ఇస్తామని, 9న వీటిని ఉన్నత విద్యామండలి ధృవీకరిస్తుందని పేర్కొంది. ఎంపికైన విద్యార్థులకు 12న ఇంటర్వ్యూ ఉంటుందని, 15న అడ్మిషన్లకు చివరి తేదీ అని ప్రకటించింది.
కానీ, రెండో విడత కౌన్సెలింగ్, మేనేజ్‌మెంట్ కోటా భర్తీ ప్రక్రియల గడువును ఈ నెల 30 వరకు పొడిగించాలన్న ఉన్నత విద్యామండలి అభ్యర్థనను సుప్రీం కోర్టు గురువారం తోసిపుచ్చింది. దీంతో ఇప్పుడు మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్ల పరిస్థితేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ సీట్లు చెల్లుబాటు కావా? అడ్మిషన్లు నిర్వహిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందా వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అడ్మిషన్లలో సీటు పొందలేని విద్యార్థులో, బ్రాంచ్ మార్చుకోవాలని భావిస్తున్న వారో సుప్రీం కోర్టును ఆశ్రయించడమొక్కటే ఇప్పుడున్న అవకాశమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కాగా సుప్రీం కోర్టు తీర్పు కాపీని పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రెండో విడత కౌన్సెలింగ్‌పై తదుపరి చర్యలు చేపడతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు.