సొంత డైలాగులే ఆ హీరోకు షాకిస్తున్నాయ్!
కళలు కేటగిరీలో మలయాళం నటుడు సురేశ్ గోపిని నరేంద్రమోదీ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయడం కేరళలో ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచలేదు. కేరళ మీడియా కూడా తూతూ మంత్రంగానే ఈ వార్తను ప్రసారం చేసింది. కేరళలో బీజేపీకి గట్టి మద్దతుదారైన సురేశ్ గోపికి ఏదో పదవి దక్కడం ఖాయమని గతకొన్ని రోజులుగా వినిపిస్తూ వస్తున్నది. పైగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మక తిరువనంతపురం నియోజకవర్గం నుంచి సురేష్ గోపికి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చింది. ఆయన స్టార్ ఛరిష్మాతో ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవచ్చునని ఆ పార్టీ భావించింది. అయితే, గోపి మాత్రం ఈ టికెట్‌ను సున్నితంగా తిరస్కరించారు. దీంతో కేంద్రంలో బీజేపీ తరఫున ఆయనకు ఏదో పదవి లభించే అవకాశముందని కేరళ బీజేపీ వర్గాలు భావిస్తూ వచ్చాయి.
ఈ క్రమంలోనే సురేశ్ గోపికి రాజ్యసభ బెర్తు ఖారరైంది. తనకు రాజ్యసభ చాన్స్ రావడంపై ఆనందం వ్యక్తం చేసిన గోపి.. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో ఎలాంటి రాజకీయమూ లేదని వివరణ ఇచ్చారు. కేరళలో బీజేపీ తరఫున అత్యధిక స్థానాల్లో తాను ప్రచారం చేస్తానని కూడా చెప్పుకొచ్చారు.
కానీ, ఊహించనీరీతిలో ఆయనను ఓ వివాదం చుట్టుముట్టుకుంది. సురేష్ గోపి మలయాళంలో పేరొందిన యాక్షన్ హీరో. ఆయన చేసిన సినిమాలన్నీ యాక్షన్ ప్రధానంగా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతాయి. చాలా సినిమాల్లో ఆయన విలన్లు అయిన రాజకీయ నాయకులను చెడమడా తిట్టేస్తూ కనిపిస్తూ ఉంటారు. అలా ఓ రాజకీయ నాయకుడ్ని లెఫ్ట్ రైట్ ఏకీపారేస్తూ గోపి విశ్వరూపం చూపే ఓ సినిమాలోని సీన్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిపోయింది. ఎన్నికల్లో ప్రజల ప్రేమాభిమానులతో గెలువలేని రాజకీయ నాయకులే దొడ్డిదారిన పార్లమెంటులో అడుగుపెడతారని, అలాంటి నాయకులు సమాజానికి పట్టిన చీడపురుగుల్లాంటివారని.. ఆయన విలన్‌ను చెండాడే డైలాగు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది.
'బాగా డబ్బున్న ఎన్నారైలు, మద్యం వ్యాపారులు నల్లడబ్బును ఎరగా వెదజల్లి ఇలాంటి విలువైన పదవులు కొనుక్కుంటున్నారు' అంటూ సురేష్ గోపి డైలాగులు కొట్టే ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నది. అంతేకాకుండా ఈ సన్నివేశం కేరళ మీడియాలోనూ ప్రముఖంగా ప్రసారమవుతున్నది. ప్రముఖ సెటైర్ షోలోనూ ఈ వీడియో ప్రసారం చేసి.. ఇదేమిటి సురేశ్ గోపి సారు అంటూ ఎద్దేవాగా జనం ప్రశ్నిస్తున్నట్టూ కథనాలు ప్రసారం చేయడం సురేశ్ గోపిని ఇరకాటంలో పడేసింది.