మహిళా వ్యాపారవేత్తలకు ప్రత్యేక 'మార్కెట్'..!
మహిళా వ్యాపారవేత్తలకు విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ హామీల వర్షం కురిపించారు. క్యాప్టివ్ మార్కెట్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. రెండు రోజుల ఇంటరాక్టివ్ టూర్ సందర్భంగా ముంబైలోని మహిళా స్వయం సహాయక బృందాలతో మాట్లాడిన ఆమె... కేంద్రంలోని మోదీ సర్కారు ఇప్పటికే సాధించిన విజయాలను వివరించారు.
మహిళాభివృద్ధకి తమ ప్రభుత్వం కృషిచేస్తోందని సుష్మా స్వరాజ్ అన్నారు. మహిళలు తమ ఉత్పత్తులను ఒకే దుకాణంలో అమ్మడం వల్ల తగినంత ఆదాయం పొందలేకపోతున్నారని, అందుకే మహిళల కోసం ప్రత్యేక క్యాప్టివ్ మార్కెట్‌ను ఏర్పాటు చేయడంవల్ల అమ్మకాలు సులభంగా జరిపేందుకు అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 'జన్ ధన్ యోజన' పథకం అంతర్జాతీయ వేదికపై అత్యంత గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు. విద్యా సంస్థలు, మరమగ్గాలు, చిన్నతరహా పరిశ్రమల నుంచి వచ్చిన ప్రతినిధులతో సుష్మా మాట్టాడారు.
ఎన్డీయే ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొందని, ఉక్రెయిన్, ఇరాక్, లిబియా, యెమెన్ వంటి దేశాలనుంచి భారతీయులను తమ ప్రభుత్వం తరలించిందని సుష్మా చెప్పారు. యెమన్ నుంచి భారతీయులను రప్పించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, అందుకు 28 దేశాలను అభ్యర్థించామని తెలిపారు. ఒకప్పుడు మోదీకి వీసా ఇవ్వడానికి అభ్యంతరం చెప్పిన అమెరికాలో.. ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతులు చాచి ఆయనను ఆహ్వానించడం ఎంతో విశేషమని చెప్పారు.