'దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి'
న్యూఢిల్లీ: భారత్‌లో అమలు చేస్తున్న క్లీన్ ఇండియా, గంగా నది ప్రక్షాళన, ఇతర కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ట్విట్టర్ అకౌంట్‌లో వీడియో పోస్ట్ చేశారు.
ఇండియా డెవలప్‌మెంట్ ఫౌండేషన్(ఐడీఎఫ్) కార్యక్రమం కింద ప్రవాస భారతీయులు తమ ఆర్థిక సహాయం అందజేయవచ్చని, వీటిని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ ఇండియా, గంగా నది ప్రక్షాళనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపయోగిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో నివసిస్తున్నా పుట్టిన దేశంతో తమ అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎన్‌ఐఆర్‌ఐలకు ఇదో చక్కని అవకాశమని ఆమె తెలిపారు.
భారత అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు చాలామంది ఎన్‌ఆర్‌ఐలు ఎదురుచూస్తున్నారని, అలాంటి వారి కోసమే ఈ ఐడీఎఫ్ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లోని వివిధ పథకాలకు తమ వంతు ఆర్థిక సహాయం చేసేందుకు గాను ఐడీఎఫ్ కార్యక్రమాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.