‘రోహింగ్యాల ముచ్చట లేదు’
న్యూయార్క్: విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అయితే వీరి భేటీలో రోహింగ్యాల సంక్షోభంపై ఎలాంటి ప్రస్తావనా చోటుచేసుకోకపోవడం గమనార్హం. బంగ్లా ప్రధానితో సుష్మా కేవలం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారని, ఈ సమావేశంలో రోహింగ్యా ముస్లింల అంశం చర్చకు రాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు.ఇరువురి భేటీ కేవలం ద్వైపాక్షిక అంశాలకే పరిమితమైందని తెలిపారు.
మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు పోటెత్తుతుండటంతో ఈ సమస్యను అధిగమించేందుకు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని మయన్మార్‌పై ఒత్తిడి పెంచాలని బంగ్లాదేశ్ కోరుతోంది. ఆగస్ట్ 25 నుంచి తలెత్తిన మలివిడత ఘర్షణల అనంతరుం మయన్మార్‌లోని రఖీనె రాష్ట్రం నుంచి 4,10,000 మందికి పైగా రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు వచ్చినట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.