మా చేతిలో కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త!
కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పాకిస్థాన్ను భారత్ గట్టిగా హెచ్చరించింది. ''మా చేతుల్లో డాలు మాత్రమే కాదు.. కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త'' అని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. సాహసాలు చేయాలనుకుంటే అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. ప్రతిసారీ వాళ్లు దాడి చేసినప్పుడు కేవలం రక్షణాత్మక చర్యలే అవలంబించేవాళ్లమని, ఈసారి ఎదురుదాడి చేయాల్సి ఉంటుందని అన్నారు.
కేవలం ఈ నెలలోనే 20 మంది భారత పౌరులు సరిహద్దు కాల్పుల్లో మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. దాంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు ఏం కావాలన్నా చేయాలని మన సైన్యానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వేచ్ఛనిచ్చారు. కానీ మరోవైపు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో మాత్రం ఎగిరెగిరి పడుతూనే ఉన్నాడు. కాశ్మీర్ తమదేనని, దాన్ని భారతదేశం నుంచి లాక్కుని తీరుతామని తాజాగా మరోసారి అన్నాడు.