సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఏడవ ప్రశ్న సంధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం సంపన్నుల కోసమే పనిచేస్తుందా అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలతో సామాన్యుల బతుకు చిన్నాభిన్నమవుతోందని, జీఎస్‌టీ..నోట్ల రద్దుతో చిన్న వ్యాపారాలు చితికిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పేదల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం కేవలం పెద్దల కోసమే పనిచేస్తుందా అని ప్రధానిని నిలదీశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రధానిని రోజుకో ప్రశ్నతో ఉక్కిరిబిక్కిరి చేయాలన్న కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా ఇప్పటికే రాహుల్ పలు ప్రశ్నలను లేవనెత్తారు.
కనీస వేతనాలపై ఏడో వేతన సంఘం రూ 18,000 నిర్ధారించగా , కాంట్రాక్టు కార్మికులకు కేవలం రూ 5,500-రూ 10,000 మాత్రమే ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు సరైన వేతనం లభించడం లేదంటూ ఓ మహిళ మాట్లాడుతున్న వీడియోనూ రాహుల్ ట్వీట్ చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్నాయి. ఈనెల 18న ఓట్ల లెక్కింపు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment