
సాక్షి, న్యూఢిల్లీ: వలసల నిరోధానికి చర్యలు తీసుకుంటామన్న హామీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజుకో ప్రశ్నను లేవనెత్తుతున్న రాహుల్ శుక్రవారం పదవ ప్రశ్నగా గిరిజనుల సమస్యలపై ప్రధానమంత్రిని నిలదీశారు. వలసలు ఆదివాసీల వెన్నువిరుస్తున్నాయని.. వలసల నిరోధానికి రూ.55 కోట్లతో మీరు ఏర్పాటు చేస్తామన్న వనబంధు కళ్యాణ్ యోజన హామీ ఏమైందని రాహుల్ ప్రశ్నించారు.
గిరిజనుల భూములను లాక్కుని వారిని నిరాశ్రయులను చేస్తున్నారని, అడవులపైనా వారికి హక్కులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లు, ఆస్పత్రులు వంటి మౌలికవసతులు కూడా గిరిజనులకు అందుబాటులో లేవని అన్నారు.
గతంలో రైతు సమస్యలు, మహిళల భద్రత, ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై ప్రధాని మోదీని రాహుల్ ప్రశ్నించారు. రైతులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని, ధరల నియంత్రణలో ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.