
19 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు విజ్ఞప్తి
చెన్నై: తమిళ రాజకీయం గంటకో మలుపు తిరుగుతోంది. పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు శశికళ, దినకరన్ వర్గం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం తంటాలు పడుతోంది. దినకరన్ వెంట ఉన్న 19 మంది తిరుగుబాబు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వ చీఫ్ విప్ రాజేంద్రన్ గురువారం శాసనసభ స్పీకర్‌కు పి ధనపాల్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై దినకరన్ వర్గం స్పందించింది. చీఫ్ విప్ ప్రతిపాదనపై కోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వం తెలిపారు. ముఖ్యమంత్రి పళనిస్వామిని మార్చాలని మాత్రమే తాము కోరుతున్నామన్నారు.
దినకరన్‌కు సీఎం పదవిపై ఆశలేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన పార్టీని నడపడం లేదని ఎమ్మెల్యే వట్రివేల్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంను కూడా పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వీరిద్దరినీ తప్పించి వేరెవరికి పదవులు అప్పగించినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కొంత మంది అవినీతి మంత్రులను కూడా తప్పించాల్సిన అవసరముందన్నారు. బలపరీక్షలో పళనిస్వామి సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. కాగా, పుదుచ్చేరి రిసార్ట్‌లో ఉన్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.