
దినకరన్ సేఫ్.. అందుకే?
శశికళ, దినకరన్ భవితవ్యంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో పన్నీర్ సెల్వం వర్గం విలీనం పూర్తయింది. శశికళ, దినకరన్ భవితవ్యంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. వీరిద్దరినీ పార్టీ నుంచి గెంటేయ్యాలని విలీన చర్చల సందర్భంగా ఓపీఎస్ వర్గం గట్టిగా పట్టుబట్టింది. అయితే దినకరన్‌ను పార్టీ నుంచి వెలి వేయకూడదన్న ఆలోచనలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఉన్నట్టు తెలుస్తోంది. దినకరన్‌పై వేటు వేస్తే తన పదవికి ముప్పు వచ్చే అవకాశం ఉన్నందున్న ఈ విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనబడుతోంది.
ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య విలీన చర్చలు తుదిదశకు వచ్చినప్పుడు దినకరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి గెంటేస్తే పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వెనుకాడబోనని పరోక్షంగా వ్యాఖ్యనించారు. అంతేకాదు తన మద్దతుగా ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో మదురైలో ర్యాలీ కూడా నిర్వహించారు. ఒకవేళ దినకరన్‌పై వేటు వేస్తే అన్నాడీఎంకే 20 మంది ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయే అవకాశముంది. 235 మంది స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. ఓపీఎస్ వర్గం నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి సర్కారు మద్దతుయిచ్చినా మేజిక్ ఫిగర్‌కు 3 సీట్లు తగ్గుతాయి.
మరోవైపు ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష డీఎంకే నాయకుడు స్టాలిన్ ఎదురు చూస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)కు 9 మంది శాసనసభ్యులున్నారు. వీరంతా కలిస్తే విపక్ష బలం 98కి చేరుతుంది. వీరికి దినకరన్ దగ్గరున్న 20 మంది ఎమ్మెల్యేలు కలిస్తే పళనిస్వామి ప్రభుత్వం కూలడం ఖాయం. అందుకే దినకరన్‌పై వేటు వేయాలని పన్నీర్ సెల్వం వర్గం ఎంత ఒత్తిడి చేస్తున్నా పళనిస్వామి ముందడుగు వేయడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం, పార్టీలో తన పంతం నెగ్గించుకున్న పన్వీర్ సెల్వం ఏం చేస్తారనే దానిపై తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.