దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించిన ఎమ్‌జీఆర్ వర్శిటీ | Tamil Nadu University Predicts 1.5 lakh Corona Cases July 15 | Sakshi
Sakshi News home page

జూలై నెలాఖరుకు 1.5 లక్షల కేసుల నమోదు

Published Fri, Jun 5 2020 3:20 PM | Last Updated on Fri, Jun 5 2020 8:09 PM

Tamil Nadu University Predicts 1.5 lakh Corona Cases July 15 - Sakshi

చెన్నై: దక్షిణాదిలో తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో డాక్టర్ ఎమ్‌జీఆర్ మెడికల్ యూనివర్సిటీ ఎపిడెమాలజిస్ట్‌ ఒకరు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. కేసులు ఇదే సంఖ్యలో నమోదయితే జూలై 15 నాటికి తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1.5లక్షలుగా ఉంటుందని.. 1600 మంది మరణిస్తారని అంచనా వేశారు. కోవిడ్-19 కట్టడి కోసం ప్రభుత్వం తమ నివేదికలను ఉపయోగించుకుందని సదరు ఎపిడెమాలజిస్ట్‌ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వెల్లడించారు. విశ్వవిద్యాలయం ఏప్రిల్ 18 నుంచి తన అంచనాలను ప్రారంభించిందని..  మే మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలిపారు. (మరో 2 వారాల్లో నంబర్‌ 4గా భారత్‌?)

డాక్టర్ ఎమ్‌జీఆర్ మెడికల్ యూనివర్శిటీలోని ఎపిడెమియాలజీ విభాగం ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ జి. శ్రీనివాస్  జూలై 15 నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలకు చేరుకుంటుందని.. అక్టోబర్ మధ్యలో గరిష్టంగా ఉంటుందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో తెలిపారు. తమ బృందం అంచనాల ప్రకారం జూన్ 30 నాటికి తమిళనాడులో కరోనా వైరస్ కేసులు సంఖ్య 1.3 లక్షలుగా ఉంటుందని.. మరణాల సంఖ్య 769కి చేరుకుంటుంది అన్నారు. గురువారం, తమిళనాడులో అత్యధికంగా ఒకే రోజు 1,384 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ కేసుల సంఖ్య 27,256కు చేరుకోగా, మరణించిన వారి సంఖ్య 220కి చేరింది. (తండ్రి మృతి.. చివరిచూపు 3 నిమిషాలే!)

ముఖ్యంగా, ఏప్రిల్ రెండవ వారం నుంచి మే మొదటి 10 రోజుల్లో కరోనావైరస్ కేసుల సంఖ్య 3,097 నుంచి 5,442కు పెరుగుతాయని విశ్వవిద్యాలయం అంచనా వేసింది. దాని ప్రకారం మే 1-10 మధ్య కేసులు సంఖ్య 2,526 నుంచి 7,204 కు పెరిగాయని వాస్తవ గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాక మే 10నాటికి కరోనా మరణాల సంఖ్యను 38గా అంచనా వేయగా ఈ సంఖ్య 47గా ఉంది. ‘కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూనే ఉంది. దానికి అనుగుణంగా తగినన్ని పడకలు, ఐసోలేషన్ సదుపాయాలు, ఐసీయూలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది’ అని శ్రీనివాస్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.

అయితే రాజధాని నగరం చెన్నైకి సంబంధించి విశ్వవిద్యాలయం ఖచ్చితమైన అంచనాలు వేసింది. మే 25 నాటికి 83 మరణాలను అంచనా వేయగా.. ఇది వాస్తవమైంది. అంతేకాక కేసుల సంఖ్యను 11,119గా అంచనా వేయగా.. వాస్తవంగా కేవలం 12 కేసులు తక్కువ నమోదయ్యాయి. జూన్ 3న వరకు 17,738 కేసులు, 156 మరణాలు సంభవిస్తాయని తెలపగా..  వాస్తవంగా 17,598 కేసులు,153 మరణాలు నమోదయ్యాయి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement