తమిళ డ్రామా మళ్లీ మొదలు..! | Tamil political drama started again | Sakshi
Sakshi News home page

తమిళ డ్రామా మళ్లీ మొదలు..!

Published Wed, Aug 23 2017 12:48 AM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM

తమిళ డ్రామా మళ్లీ మొదలు..!

తమిళ డ్రామా మళ్లీ మొదలు..!

పళని, పన్నీర్‌ వర్గాల విలీనంతో అన్నాడీఎంకేలో తాజా సంక్షోభం
- పళనిస్వామికి మద్దతు ఉపసంహరించిన దినకరన్‌ వర్గం 
గవర్నర్‌ను కలసిన 19 మంది ఎమ్మెల్యేలు..  
ముఖ్యమంత్రిపై విశ్వాసం లేదంటూ లేఖల సమర్పణ 
విశ్వాస పరీక్షకు ఆదేశించాలని గవర్నర్‌కు డీఎంకే లేఖ
 
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వర్గాలు విలీనం పూరై్త 24 గంటలు గడవకముందే అధికార అన్నాడీఎంకే పార్టీలో మరో సంక్షోభం తలెత్తింది. పళనిస్వామి నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం 19 మంది దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావును చెన్నైలోని రాజ్‌భవన్‌లో కలసి లిఖితపూర్వకంగా తమ నిర్ణయాన్ని తెలియజేశారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని డీఎంకే డిమాండ్‌ చేసింది. 
 
పళనిస్వామిపై విశ్వాసం లేదు.. 
తన వర్గం ఎమ్మెల్యేలతో దినకరన్‌ మంగళవారం ఉదయం 8 గంటలకు సమావేశమయ్యారు. 9.30 గంటలకు ఏడు కార్లలో 19 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లి 10 గంటలకు గవర్నర్‌ను కలుసుకున్నారు. ఎమ్మెల్యేలంతా విడివిడిగా మద్దతు ఉపసంహరణ లేఖలను గవర్నర్‌కు సమర్పించారు. వాటిని పరిశీలించి తగిన చర్య తీసుకుంటానని గవర్నర్‌ వారికి హామీ ఇచ్చారు. ‘‘మా వర్గం ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు చర్యలు ప్రారంభించాం’’అని దినకరన్‌ మద్దతుదారు, అండిపత్తి ఎమ్మెల్యే తంగ తమిళ్‌ సెల్వన్‌ గవర్నర్‌ను కలసిన అనంతరం ప్రకటించారు. పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించగా.. తమ ఉద్దేశం అదే అని సెల్వన్‌ చెప్పారు. పార్టీ నుంచి శశికళను తొలగించే ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. 
 
విలీనం కాదు.. వెన్నుపోటు.. 
పళని–పన్నీర్‌ వర్గాల విలీనం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను వెన్నుపోటు పొడవడమేనని దినకరన్‌ అభివర్ణించారు. ఇది విలీనం కాదని వ్యక్తిగత ప్రయోజనాలు, పదవీకాంక్ష, పదవులను కాపాడుకోవడం కోసమే ఈ పని చేశారని ట్వీటర్‌లో మండిపడ్డారు. శశికళకు వెన్నుపోటు పొడిచిన పళనిస్వామి, పన్నీర్‌సెల్వంను పార్టీ కార్యకర్తలు, ప్రజలు క్షమించబోరని చెప్పారు. కాగా, అన్నాడీఎంకే నుంచి శశికళను తొలగించేందుకు చర్యలు ప్రారంభిస్తామని ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు ఆర్‌. వైద్యలింగమ్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు దినకరన్‌ ప్రకటించారు. వైద్యలింగమ్‌ పళనిస్వామికి సన్నిహితుడు. 
 
విశ్వాస పరీక్ష పెట్టండి.. 
తాజా పరిణామాల నేపథ్యంలో పళనిస్వామిని సభలో బలం నిరూపించుకునేలా ఆదేశించాలని కోరుతూ డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. 22 మంది ఎమ్మెల్యేలు సీఎంపై విశ్వాసం లేదని ప్రకటించారని, దీంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందన్నారు. పీఎంకే నేత అన్బుమణిరామ్‌దాస్‌ కూడా పళనిస్వామి బలం నిరూపించుకోవాలని కోరారు. 
 
బలాబలాలు ఇవీ.. 
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 234 కాగా.. జయలలిత మరణంతో ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. అన్నాడీఎంకేకు 135, ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు 89 సీట్లు, ఆ పార్టీ మిత్రపక్షాలైన కాంగ్రెస్‌కు 8, ఐయూఎంఎల్‌కు ఒక సీటు ఉన్నాయి. ప్రస్తుతం 233 మంది సభ్యులకు గాను అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలంటే పళని స్వామికి 117 మంది మద్దతు అవసరం. తాజా లెక్కల ప్రకారం ఆయన బలం 122 నుంచి 112కు పడిపోయింది. గవర్నర్‌ బలపరీక్షకు ఆదేశిస్తే మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో తమిళనాడులో మళ్లీ క్యాంప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. తన వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా దినకరన్‌ పుదుచ్చేరిలో క్యాంప్‌ పెట్టారు. ప్రత్యేక బస్సులో మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేల్ని పుదుచ్చేరికి పంపారు. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని దినకరన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
అన్నాడీఎంకేలో ఏ వర్గంలో ఎంతమంది.. 
పళని వర్గం : 112 మంది 
దినకరన్‌ వర్గం : 19 మంది  
దినకరన్‌కు మద్దతిస్తున్న మరో వర్గం 3 (కరుణాస్, తనియరసు, తమీమ్‌ అన్సారీ)  
తటస్థ ఎమ్మెల్యే : 1 (తోప్పు వెంకటాచలం)   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement