టీ బిల్లులో ఆర్థికాంశాలు: న్యాయశాఖ
తెలంగాణ బిల్లులో ఆర్థికాంశాలున్నాయని న్యాయ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. దాంతో బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీన లోక్సభలోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని యూపీఏ సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ముందుగా మంగళవారం నాడు లోక్సభ బీఏసీ సమావేశం నిర్వహించారు. టేబుల్ బిల్లుగా తెలంగాణ అంశాన్ని ప్రవేశపెట్టాలని అందులో నిర్ణయించారు. అప్పటికే న్యాయ శాఖ నుంచి కూడా అభిప్రాయం రావడం, బిల్లులో ఆర్థికాంశాలు ఉన్నాయని తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ పెద్దల గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డు పడినట్లయింది.
వాస్తవానికి తెలంగాణ బిల్లును మంగళవారమే రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు ముందుగా కేంద్రం రంగం సిద్ధం చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సభలో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించి ఆ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి సమాచారమిచ్చింది. కానీ సోమవారం రాత్రికల్లా ఉన్నట్టుండి సీను మారిపోయింది. విభజన బిల్లును ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చా, లేదా అన్న మీమాంస తలెత్తడంతో దానిపై కేంద్ర న్యాయ శాఖను రాజ్యసభ సచివాలయం సలహా కోరింది. విభజన బిల్లులో ఆర్థికపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయా, లేదా అన్న అంశంపై న్యాయ శాఖ నుంచి స్పష్టత కోరింది.
ఇదే అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ బిల్లు ఆర్థిక బిల్లు కాదని ఆ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం గట్టిగా వాదిస్తారని చెబుతున్నారు. కానీ ఇప్పటికే న్యాయశాఖ ఇందులో ఆర్థికాంశాలు ఉన్నాయని చెప్పడంతో ఇక లోక్సభలోనే బిల్లును ప్రవేశపెట్టాలని, అయితే ఆ సమయంలో సభలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశాలపైనే కోర్ కమిటీ ప్రధానంగా చర్చించబోతోంది. ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సీమాంధ్ర ఎంపీలను లోక్సభ నుంచి కూడా సస్పెండ్ చేసి, తమకు ఇబ్బంది లేకుండా చేసుకుని బిల్లును ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.