7న లోక్సభలో.. 10న రాజ్యసభలో!
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై సుప్రీం కోర్టులో పిల్.. నిరసన దీక్షలు.. అఖిల పక్ష సమావేశంలో భిన్నాభిప్రాయాలు.. జాతీయ నేతలతో మంతనాలు.. ఇలా దేశ రాజధానిలో రాజకీయం వేడిక్కినా కేంద్ర ప్రభుత్వం మాత్రం దూకుడు కొనసాగిస్తోంది. ఈ నెల 7న లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. ఆ తర్వాత రైల్వే, ఆర్థిక బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక రాజ్యసభలో ఈ నెల 10న తెలంగాణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీకి లేఖ రాశారు. 5న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 21 వరకు జరగనున్నాయి.
పార్లమెంట్లో తెలంగాణ బిల్లుతో పాటు అవినీతి నిరోధక, మత హింస నిరోధక, తదితర బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే వీటన్నంటికంటే తెలంగాణ బిల్లుపైనే ప్రతిష్టంభన నెలకొంది. అఖిల పక్ష సమావేశంలో టి బిల్లుపై ఏకాభిప్రాయం కుదరలేదు. కాంగ్రెస్ ద్వంద వైఖరి అవలంభిస్తోందంటూ బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాగా ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరో వైపు తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం చివరిసారిగా మంగళవారం సమావేశమై కొన్ని మార్పులతో ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దింది. దీన్ని ఈ నెల 6న కేంద్ర కేబినెట్కు పంపనుంది.