
దేశానికి ప్రమాదకర సంకేతం: మమతా బెనర్జీ
కోల్‌కతా: తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తీరు రాజ్యాంగవిరుద్ధమని, అప్రజాస్వామికమని, అనైతికమని, చట్టవ్యతిరేకమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తీరుపై మమతాబెనర్జీ శుక్రవారం ఫేస్‌బుక్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ రాజకీయ ఎజెండా కోసమే కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ విభజనకు పూనుకున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్-బీజేపీ అపవిత్ర బంధం దేశానికి ప్రమాదకర సంకేతమని ఆమె అభివర్ణించారు.
ఆ రెండు పార్టీలు పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కీలకమైన బిల్లుల విషయంలో ఈ రెండు జాతీయ పార్టీలూ రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఈ విధంగా కుమ్మక్కైతే రాష్ట్రాల పరిస్థితి ఏమిటని ఆమె నిలదీశారు. ఇదే జరిగితే దేశ భవిష్యత్తు ఏమవుతుందని ప్రశ్నించారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన విభజన బిల్లును చీకట్లో, ప్రత్యక్ష ప్రసారాన్ని నిలుపుదల చేసి ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలపడమే అని చెప్పారు. లోక్‌సభలో అన్యాయంగా ఆమోదం పొందిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి అంతే అన్యాయంగా ఆమోదింపజేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు డివిజన్ కోరినా, సవరణలు కోరినా పట్టించుకోకుండా ఆమోదించారని ధ్వజమెత్తారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మమత ఆరోపించారు.