అధికారుల బదిలీకి అంగీకారం... ఇది కక్షసాధింపంటూ ధ్వజం
దుర్గాపూర్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశాలకు తలొగ్గారు. జైలుకైనా వెళ్తానుగానీ ఎన్నికల అధికారుల బదిలీకి అంగీకరించబోనంటూ సోమవారం తెగేసి చెప్పిన ‘దీదీ’ మంగళవారం మెట్టుదిగారు. విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు అధికారులను బుధవారం ఉదయం 10 గంటల్లోగా బదిలీ చేయాల్సిందేనంటూ ఈసీ అల్టిమేటం జారీచేయడంతో మమత అయిష్టంగానే బదిలీకి అంగీకరించారు. ఈసీ ఆదేశాలను అమలు చేస్తానని దుర్గాపూర్‌లో మంగళవారం హడావిడిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
‘‘ఈసీ ఆదేశాల ప్రకారం నలుగురు జిల్లా ఎస్పీలు, ఒక జిల్లా మేజిస్ట్రేట్, ఇద్దరు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌లను బదిలీ చేసి వారి స్థానంలో వేరే వాళ్లను నియమిస్తా. దీనిపై నాకు అభ్యంతరం లేదు’’ అని మమత పేర్కొన్నారు. అయితే ఈసీపై మమత మాటల దాడిని కొనసాగించారు. ఈ ఆదేశాలను రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు.
మాజీ ఇన్ఫీలపై భారీ అంచనాలు
బెంగళూరు: ఇన్ఫోసిస్ మాజీలు నందన్ నీలేకని, వి.బాలకృష్ణన్‌ల విషయంలో ఐటీ దిగ్గజాలు భారీ అంచనాలతోనే ఉన్నారు. రాజకీయ వాతావరణంలో మార్పుకు వారు నాయకత్వం వహిస్తారని, ఉపాధి కల్పన, ఆర్ధికాభివృద్ధి దిశగా ఇద్దరూ కృషి చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీలేకని బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, బాలకృష్ణన్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తుండటం తెలిసిందే.
ఈసీ ఆదేశాలకు తలొగ్గిన మమత
Published Wed, Apr 9 2014 2:08 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement