
గందరగోళం మధ్య బిల్లు వద్దు: జైరాం రమేశ్
బిల్లు ఆమోదానికి తొందర పడొద్దు.. కాంగ్రెస్‌కు కేంద్ర మంత్రి సలహా
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు గందరగోళం మధ్య పార్లమెంటు ఆమోదం పొందే ప్రయత్నం చేయరాదని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. బిల్లును వ్యతిరేకిస్తూ సభల్లో హింసాత్మక నిరసనలు కూడా జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. దీర్ఘకాలిక పర్యవసానాలుండే ఇలాంటి బిల్లుపై పార్లమెంటులో లోతుగా చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. ఆదివారం సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్‌లో కరణ్ థాపర్ నిర్వహించిన డెవిల్స్ అడ్వకేట్ కార్యక్రమంలో జైరాం పాల్గొన్నారు. ఇంత ముఖ్యమైన బిల్లుపై కూలంకషంగా చర్చ జరగాలే తప్ప దాన్ని గందరగోళం మధ్య ఆమోదించరాదని వాదించే వారిలో తానే ముందుంటానన్నారు. ఈ విషయమై తాము (కాంగ్రెస్) పార్లమెంటులో ఎలాంటి ఏకపక్ష ధోరణీ ప్రదర్శించరాదని కూడా అభిప్రాయపడ్డారు. తమ పార్టీ వేదికలపై కూడా తాను ఇదే అభిప్రాయం వ్యక్తపరిచినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందంలోని కీలక సభ్యుడైన ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బిల్లుపై బీజేపీతో పాటు ఇతర పార్టీలన్నింటి ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని జైరాం అన్నారు. పార్లమెంటులో మరో నాలుగు రోజుల సమయమున్నందున బిల్లుకు ఆమోదం పొందగలమని ధీమా వెలిబుచ్చారు.
లక్ష్మణ రేఖ దాటిన కిరణ్: విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరిని జైరాం తీవ్రంగా దుయ్యబట్టారు. ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి విధేయునిగా లేరంటూ ఆక్షేపించారు. ‘‘దురదృష్టం కొద్దీ ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్టీపరమైన క్రమశిక్షణకు సంబంధించి ఆయన లక్ష్మణ రేఖను దాటారు’’ అని విమర్శించారు.