సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకు సాయంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 12 లక్షలు మంజూరు చేసింది. కొందరు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జర్నలిస్టులు, వారి ప్రైమరీ కాంటాక్టుల పరీక్షలు, చికిత్సల కోసం ఈ నిధులు వెచ్చించనున్నట్టు తెలంగాణ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. జర్నలిస్టుల క్షేమంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరా తీశారని, వారికి సాయంగా అన్ని చర్యలూ తీసుకోవాల ని, నిధులు విడుదల చేయాలని ఐ అండ్ పీఆర్ విభాగంతో చర్చించారని తెలిపింది.
కాగా, తెలంగాణ మీడియా అకాడమీ తరపున చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు రూ. 20 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. అలాగే, మంగళవారం 31మంది జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి జి.కిషన్‌రెడ్డి అపోలో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించేందుకు వ్యక్తిగతంగా సాయం చేశారు. బుధవారం కూడా అపోలోలో మరికొందరికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బాధితులకు చికిత్స అందించేందుకు అపోలో, ఆర్‌ఎంఎల్ ఆసుపత్రి వర్గాలతో స్వయంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డిలకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఢిల్లీ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
ఢిల్లీలోని ఏపీ జర్నలిస్టులపై వైఎస్ జగన్ ఆరా
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ఏపీ జర్నలిస్టులకు కరోనా సోకిన నేపథ్యంలో వారి గురించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. అవసరమైన సాయాన్ని ఎప్పటికçప్పుడు అందించాలని సీఎం ఆదేశించినట్లు ఏపీ ప్రభు త్వ సమాచార విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో జర్నలిస్టుల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్ త్రిపాఠి, రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, స్పెషల్ కమిషనర్ రమణారెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment