తెలంగాణపై నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం: సోమయాజులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యుడు డీఏ సోమయాజులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. విభజనపై కేంద్రం తీసుకున్న నిర్హేతుక నిర్ణయంతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని, పెద్దఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయని, ఆస్తి, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటున్నాయని అందు లో వివరించారు. తెలంగాణ ఏర్పాటుపై అక్టోబర్ 3న కేంద్ర మం త్రివర్గం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాల్సిందిగా కోరారు. రాష్ట్రాల విభజనకు సహేతుకమైన విధానాన్ని రూపొందించే వరకు కొత్త రాష్ట్రాల ఏర్పాటును ఆపాలని విన్నవించారు.
రాజ్యంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు కోసం ఎలాంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టకుండా రాష్ట్రపతిని నిలువరించాలని అభ్యర్థించారు. ఆర్టికల్ 3... కేం ద్రంలోని అధికార పార్టీ చేతిలో ఆయుధంగా మారకూడదని, తన రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా రాష్ట్రాలను విభజించేందుకు దోహదపడకూడదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్‌సాల్వే పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక సరైన విధానాల ప్రకారమే రాష్ట్రాల విభజన జరగాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరగాలని రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1956 చెబుతోందని వివరించారు.
అయితే ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ల ఏర్పాటు సమయంలో ఇది వర్తించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం... వాటి మాతృ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అసెంబ్లీల్లో విభజనకు అనుకూలంగా చేసిన తీర్మానాన్ని ఆధారంగా తీసుకుందని పిటిషన్‌లో గుర్తుచేశారు. సర్కారియా కమిషన్ సైతం తన నివేదికలో ఇదే తరహా విషయాన్ని పేర్కొన్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. అది ఆర్థికంగా నిలదొక్కుకుంటుందా, పాలన, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగుతాయా అన్న అంశాలను ఒక స్వతంత్ర యంత్రాంగం పరిశీలించాలన్నారు. అంతేతప్ప రాజకీయ కారణాలతో నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు అక్కడే కొలువుదీరాయని వివరించారు. మిగతా రాష్ట్రం.. ముఖ్యంగా సీమాంధ్రలోని అనేక జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని వివరించారు. రాష్ట్రాన్ని విభజిస్తే.. వ్యవసాయాధార ప్రాంతమైన సీమాంధ్రలో రైతులతోపాటు, సామాన్యులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.