సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు తెలుగు రాష్ట్రాల నేతలను బరిలో దింపాయి. పెద్దసంఖ్యలో తెలుగు ఓటర్లున్న ప్రాంతాల్లో ఏపీ, తెలంగాణ నేతలు ఆయా పార్టీల తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మే 12న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టేందుకు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి కర్ణాటకలోని పలు తెలుగు అసోసియేషన్ల సభ్యులతో సమావేశమయ్యారు. రఘువీరాతో పాటు ఏపీలోని పలు సీనియర్ కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీ కన్నడ ప్రచార బరిలో నిలిపింది. మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, మాజీ ఎంపీ మధు యాష్కీ ప్రచారంలో పాల్గొంటున్నారు.
తెలుగు వారు అధికంగా ఉండే బళ్లారి, రాయ్‌చూర్, కొప్పాల, దావణగెరే, తుంకూర్, కోలార్, చిక్‌బళ్లాపూర్, బెంగళూర్ సిటీ, బెంగళూర్ రూరల్ ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వాలు తెలుగు రాష్ట్రాల నేతలతో ప్రచారం చేపట్టాయి. ఇక మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు, ఇతర సీనియర్ నేతలతో కలిసి బీజేపీ తరపున ప్రచారం చేపట్టారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు లభించడంతో జేడీఎస్ కూడా తెలుగు ఓటర్ల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. కర్ణాటకలోని 224 అసెంబ్లీ సీట్లలో దాదాపు 40 స్ధానాల్లో ఫలితాలను తెలుగు ప్రజలు నిర్ధేశించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment