సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం వంటి ఘటనల్లో దోషులకు కఠిన శిక్ష పడేలా చట్టాన్ని తేవడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని, ఈ ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదని, ఏ పదాలతో దీనిని ఖండించాలో కూడా అర్థం కావడం లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై లోక్‌సభ జీరో అవర్‌లో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ ఒక దశలో ఆయన కూడా భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్‌లో గత బుధవారం రాత్రి జరిగిన అత్యాచార ఘటనపై సోమవారం లోక్‌సభలో వాడీవేడిగా చర్చ జరిగింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దిశ ఘటనపై చర్చించేందుకు వాయిదా తీర్మానం ఇచ్చారు.
సభ ప్రారంభం కాగానే సభా కార్యకలాపాలు వాయిదా వేసి దీనిపై చర్చించాలంటూ రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలంతా ప్లకార్డులు ప్రదర్శించారు. ‘రేపిస్టులను శిక్షించండి.. అత్యాచారాలను ఆపండి’అంటూ నినాదాలు చేశారు. డీఎంకే నేత టీఆర్ బాలు కూడా లేచి ఇదే అంశాన్ని సభాపతి దృష్టికి తెచ్చారు. అయితే సభాపతి ఓం బిర్లా.. ఈ అంశంపై చర్చించేందుకు జీరో అవర్‌లో అవకాశం ఇస్తానని చెప్పడంతో రేవంత్‌రెడ్డి సభాపతితో సంవాదానికి దిగారు. ‘ఈ అంశం చాలా తీవ్రమైంది. జీరో అవర్‌లో చర్చించే అంశం కాదిది. వాయిదా తీర్మానానికి జీరో అవర్‌కు ఎలా ముడిపెడతారు. ఒక అమ్మాయిపై జరిగిన అత్యాచారకాండపై దేశం రోదిస్తోంది’అని అన్నారు. దీనికి సభాపతి స్పందిస్తూ ‘మొత్తం దేశం విచారం వ్యక్తం చేసింది. ఈ సభ కూడా విచారం వ్యక్తం చేస్తోంది. అయితే జీరో అవర్‌లో అందరూ దీనిపై మాట్లాడొచ్చు’అని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు శాంతించారు. జీరో అవర్‌లో ఈ అంశంపై చర్చను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు.
ఖండించేందుకు మాటలు లేవు రాజ్‌నాథ్
హత్యాచార ఘటనపై జీరో అవర్‌లో పలు పార్టీల నేతలు మాట్లాడిన తరువాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ జోక్యం చేసుకుని దోషులకు కఠిన శిక్ష విధించేందుకు ఎలాంటి చట్టమైనా తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌లో జరిగిన ఘటనను మించిన అమానవీయ చర్య ఇంకొకటి ఉండదు. ఈ ఘటనపై యావత్తు దేశం విచారం వ్యక్తం చేస్తోంది. ఘటనను అందరూ ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని అంద రూ కోరుకుంటున్నారు. నిర్భయ ఘటన తరువాత దేశంలో ఒక కఠిన చట్టాన్ని ప్రవేశపెట్టాం. దేశంలో మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవని అప్పుడు అందరూ అనుకున్నారు. అయితే దీని తరువాత కూడా అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు దోషులను శిక్షించేందుకు ఎంత కఠిన చట్టాన్ని చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. సభ దీనిపై చర్చించాలనుకుంటే చర్చించండి. సలహాలు ఇవ్వండి. ఈ ఘటనపై స్పందించేందుకు నాకు మాటలు రావడం లేదు. ఏ పదాలతో దీనిని ఖండించాలో కూడా తెలియడం లేదు’అని పేర్కొన్నారు.
మార్పులకు సిద్ధం కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
‘ఐపీసీ, సీఆర్పీసీలో మార్పులు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ బాధ్యతను బోర్డు ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు అప్పగించాం. ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాసి సూచనలు కోరాం. డ్రాఫ్ట్ కూడా సిద్ధంగా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలోనే బిల్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్ ఘటనలో పోలీసులు ఇంకా క్రియాశీలకంగా పనిచేయాల్సింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టంను ప్రారంభించాం. కేంద్రం మహిళల రక్షణపై నిబద్ధతతో ఉంది. ఉగ్రవాదం, అవినీతి నిర్మూలనకు మోదీ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో.. అలాగే మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు పనిచేస్తోంది’అని పేర్కొన్నారు.
పోలీసుల నిర్లక్ష్యంతోనే.. :ఉత్తమ్
‘తెలంగాణ పోలీసుల నిర్లక్ష్యం, జాతీయ రహదారుల పక్కన విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే హైదరాబాద్ నగర శివారులో దిశ హత్య జరిగింది. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు మొదట ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేయకపోగా.. మీ అమ్మాయి ఎవరితోనో వెళ్లిపోయి ఉంటుందంటూ అవమానకరంగా మాట్లాడారు. అప్పుడే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఉంటే ఆ యువతి ప్రాణాలతో బతికుండేది. మరోవైపు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో జాతీయ రహదారి పక్కన విచ్చలవిడి మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. దీనిపై కేంద్రం దృష్టిసారించాలి. ఇక ఘటనకు ముందు బాధితురాలు కుటుంబ సభ్యులకు కాకుండా పోలీసులకు ఫోన్ చేసి ఉంటే బతికుండేదని రాష్ట్ర హోం మంత్రి బాధ్యతారహితంగా మాట్లాడటం తగదు.’
వెంటనే శిక్షలు పడాలి: బండి సంజయ్
‘దిశపై అత్యాచారం, హత్య ఘటన దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. మహిళల రక్షణకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో వాటి అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా వారి రక్షణకు తీసుకుంటున్న చర్యల అమలు ఏ మేరకు జరుగుతోంది అన్నదానిపై చర్చ జరగాలి. ఇలాంటి ఘటనల్లో దోషులకు వెంటనే శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకురావాలి’
ఉరిశిక్ష పడేలా...: ఎం. కవిత
‘మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే దోషులకు వెంటనే ఉరిశిక్ష పడేలా ప్రత్యేక చట్టం చేయాలి. శంషాబాద్‌లో యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సమాజం సిగ్గుపడాల్సిన విషయం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొందరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలు చేయకుండా పార్టీలకతీతంగా మహిళల రక్షణకు ఎలాంటి చట్టాలు చేయాలన్నదానిపై మాట్లాడాలి. దోషులకు ఉరిశిక్ష పడేలా కఠిన చట్టాలు రూపొందించాలి.’
స్వేచ్ఛగా బతకనివ్వండి: వంగా గీత
‘భవిష్యత్‌లో మహిళలు బయటకు రాకుండా ఉండే పరిస్థితులు ఏర్పడకుండా సమాజంలో స్వేచ్ఛగా బతకనివ్వాలి. మ హిళలను పూజించాల్సిన అవసరం లేదు.. స్వేచ్ఛగా బతకనిస్తే చాలు. హత్యాచార ఘటనలకు పాల్పడిన దోషులకు ఉరిశిక్ష పడేలా రాష్ట్రాలతో కలసి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి.’
అవగాహన కల్పించాలి: రామ్మోహన్‌నాయుడు
‘దిశ హత్య ఘటనతో దేశంలోని ప్రతి మహిళ భయాందోళన చెందుతోంది. ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష వేయాలి. విద్యార్థి దశ లోనే యువకుల్లో అవగాహన కల్పించాలి. ‘నో మీన్స్ నో(లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం)’ పై స్కూలు, కాలేజీల్లో, పని ప్రదేశాల్లో అవగాహన కల్పించాలి.’
ఉరిశిక్ష అమలేది?: రేవంత్‌రెడ్డి
‘దిశ ఘటన పోలీసుల వైఫల్యం వల్లే జరిగింది. హాజీపూర్‌లో 9 నెలల అ మ్మాయి హత్యాచారం కేసులో దోషికి సెషన్స్‌కోర్డు ఉరి శిక్ష విధించింది. కానీ హైకోర్టు దాన్ని జీవితఖైదుగా మా ర్చింది. ఉరిశిక్షను ఎందుకు అమలు చేయలేదు. నిర్భయ ఘటన దోషులను ఇప్పటి వరకు శిక్షించలేదు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలి.’
ముక్తకంఠంతో ఖండించిన అన్ని పార్టీలు
దిశ ఘటనను లోక్‌సభలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. లోక్‌సభలో బీజేడీ సభ్యుడు పినాకి మిశ్రా, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, అప్నాదల్ నుంచి అనుప్రియా పటేల్, శివసేన నుంచి వినాయక్ బి.రౌత్, బీఎస్పీ నుంచి కున్వర్ దమ్షిఅలీ, టీఎంసీ నుంచి సౌగత్‌రాయ్ మాట్లాడారు. కాగా, చర్చ ముగిసిన అనంతరం ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా పార్ల మెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment