
వాషింగ్టన్ : అంతర్జాతీయంగా కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ విధానంగా మార్చుకున్నాయని ఐక్యరాజ్య సమితిలో భారత లీగల్ అడ్వైజర్ యెడ్ల ఉమాశంకర్ పేర్కొన్నారు. ఇటువంటి దేశాలను ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని ఆమె సమితికి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు ఆయుధాలను అందించి, సహకరిస్తున్నదేశాలు.. ఏదో ఒకరోజున వారు కూడా ఫలితం అనుభవిస్తారని చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడంపై జరిగిన చర్చలో ఉమాశంకర్ భారత ప్రతినిధిగా అభిప్రాయాలను వెలువరించారు.
ఉగ్రవాదాన్ని నాశనం చేయాలంటే వారికి అందుతున్న మౌలిక వసతులను దెబ్బ కొట్టాలని.. అందులో ప్రధానంగా ఆర్థిక మూలాలను నాశనం చేయాలని పిలుపునిచ్చారు. భారత్ దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఉదుర్కొంటోందని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఉగ్రవాదులకు ఆర్థిక, ఆయుధ, ఇతర అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్న దేశాలను, వ్యక్తులపై టెర్రరిస్ట్ కేసులు పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె పాకిస్తాన్‌ను పరోక్షంగా టెర్రరిస్ట్ అడ్డా అని పేర్కొన్నారు.