మైసూరు ప్యాలెస్‌కు డేంజర్‌ | terrorist thret to mysure palace | Sakshi
Sakshi News home page

మైసూరు ప్యాలెస్‌కు డేంజర్‌

Published Tue, Dec 19 2017 10:56 AM | Last Updated on Tue, Dec 19 2017 11:39 AM

terrorist thret to mysure palace - Sakshi

సాక్షి, మైసూరు: దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మైసూరు ప్యాలెస్‌ కూడా ఉగ్ర ముప్పు పొంచిఉంది. దసరా ఉత్సవాలలోనే కాకుండా ప్రతిరోజూ దేశవిదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. దాంతో ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో మైసూరు ప్యాలెస్‌ ఉందని నిఘా సంస‍్థలు పేర్కొనడంతో మైసూర్‌ ప్యాలెస్‌కు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా భధ్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీస్‌శాఖ, అగ్నిమాపకశాఖలకు కర్ణాటక సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత‍్వ ఆదేశాల మేరకు ప్యాలెస్‌ ఆవరణలో ఇకపై 24 గంటల పాటు భధ్రతా బలగాల పహారాతో పాటు ప్యాలెస్‌ ఆవరణలోనే అగ్నిమాపక వాహనాలు, సిబ్బందికి కార్యాలయం, బస ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్‌ డీ.రందీప్‌ రెండు శాఖలకు ఉత‍్తర్వులు జారీచేశారు.

ఇప్పటికే హైదరాబాద్‌లోనున్న ఎన్‌ఐఏ అధికారులు మూడుసార్లు మైసూరు ప్యాలెస్‌లో భధ్రతా ఏర్పాట్లు పరిశీలించి ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరింత భధ్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. అంతేకాకుండా ప్రైవేటు భధ్రతా సిబ్బందితో పాటు ప్రస్తుతమున్న సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలు అమర్చాలని చెప్పారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండడానికి ప్యాలెస్‌ ఆవరణలోనే అగ్నిమాపక వాహనాలు, కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ సూచించారు. ఎన్‌ఐఏ అధికారుల సూచనల ప్రకారం అదనపు భధ్రతా సిబ్బంది, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అగ్నిమాపక వాహనాలు, కార్యాలయం, సిబ్బందిని మాత్రం ఇంతవరకూ ఏర్పాటు చేయలేకపోయారు.

గత సంఘటనల దృష్ట్యా...
సుమారు నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించిన మైసూరు ప్యాలెస్‌లో రెండు శతాబ్దాల క్రితం జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ప్యాలెస్‌ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. అనంతరం అదేస్థలంలో ప్రస్తుతమున్న ప్యాలెస్‌ను నిర్మించారు. ప్రస్తుతమున్న అంబావిలాస్‌ ప్యాలెస్‌లో అరుదైన, ఎంతో విలువైన చెట్లతో స‍్తంభాలను ఏర్పాటు చేసారు. కోట్లాది రూపాయల విలువ చేసే బంగారుపూతతో ఈ స‍్తంభాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇలా ప్యాలెస్‌లో ప్రతీ వస్తువు, స‍్తంభాలు తదితర వస్తువులన్నింటినీ అరుదైన వృక్షాల దుంగలతో నిర్మించారు. అంతేకాకుండా ప్యాలెస్‌లో కోట్ల విలువ చేసే తైలవర్ణ చిత్రలేఖనాలు, వంశపారంపర్య, చార్రితాత్మక కట్టడాలు, విగ్రహాలు ఉన్నాయి.

దీంతో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా లేదా ఉగ్రవాదుల దాడి నుంచి ప్యాలెస్‌ను రక్షించడానికి వీలుగా ప్యాలెస్‌ ఆవరణలో అగ్నిమాపక వాహనాలు, కార్యాలయంతో పాటు సిబ్బందికి కూడా అక్కడే బస ఏర్పాటు చేయాలంటూ ఎన్‌ఐఏ సూచించింది. వీటితో పాటు 72 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్యాలెస్‌ చుట్టుపక్కల వందల సంవత్సరాల కాలం నాటి దేవాలయాలు, మ్యూజియంతో పాటు రాజ వంశానికి చెందిన అశ్వాలు, ఏనుగులు, ఒంటెలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్యాలెస్‌ వెనుకభాగంలోనే రాజ వంశస్థులు కూడా తరతరాలుగా నివాసం ఉంటుండడంతో ప్యాలెస్‌లో భధ్రతను కట్టుదిట్టం చేయాలంటూ ఎన్‌ఐఏ సూచించింది. దీంతో బెంగళూరు నగరంలోని విధానసౌధ, ఎం.ఎస్‌.రామయ్య బిల్డింగ్, హైకోర్టు, రాజ్‌భవన్‌ తదితర కట్టడాల ఆవరణలో ఏర్పాటు చేసిన విధంగానే ప్యాలెస్‌ ఆవరణలో కూడా అగ్నిమాపక కేంద్రం, వాహనాలు, సిబ్బందిని నియమించాలంటూ రాష్ట్ర అగ్నిమాపక దళం డీజీపీ, పోలీసుశాఖ డీజీపీలను ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement