నాన్న ఎంత పనిచేశాడు!
థానె: నాన్న కొత్త షూలు కొనిపెడతానని చెప్పగానే ఆరేళ్ల చిన్నారి సంబరపడింది. తండ్రితో కలిసి ఉత్సాహంగా బయటకు వెళ్లింది. కన్నతండ్రి కాలయముడిగా మారతాడని ఊహించలేకపోయింది. ఏం దుర్బుద్ధి పుట్టిందో, ఏమో పసిపిల్ల అని కూడా చూడకుండా ఆమె నదిలోకి విసిరేశాడు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనూహ్యంగా 11 గంటల తర్వాత చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
షూలు కొనిపెడతానని చెప్పడంతో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తండ్రితో కలిసి చిన్నారి బయటకు వెళ్లింది. బద్లాపూర్ వద్ద వాలివ్ల్లీ వంతెన పైనుంచి చిన్నారి ఆమె తండ్రి ఉల్హాస్ నదిలోకి విసిరేశాడు. మర్నాడు ఉదయం వంతెన కింద నుంచి పాప ఏడుపు వినిపిస్తుండడంతో నిర్మాణ కంపెనీ సెక్యురిటీ గార్డు రమేశ్ బొహెయిర్(35) పోలీసులకు సమాచారం అందించాడు. 15 నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు 7.45 గంటల ప్రాంతంలో చిన్నారిని రక్షించారు.
గుర్రపు డెక్క ఉండడంతో పాప ప్రాణాలతో బయట పడిందని పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి పాప కనబడడం లేదని ఆమె తల్లి ఫిర్యాదు చేసిందని వార్తక్ నగర్ పోలీసు అధికారి కేజీ గావిట్ తెలిపారు. గురువారం ఉదయం పాపను నదిలో కనుగొన్నామని చెప్పారు. చిన్నారిని నదిలోకి విసిరేసిన ఆమె తండ్రిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.