అమ్మాయి తప్పిపోయింది...గూగుల్ కలిపింది
పాట్నా: చిన్నప్పుడు తప్పిపోయిన ఓ అమ్మాయి 17 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను కలుసుకుంది. ఓ అధికారిణి, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. ఆ అమ్మాయిని, కుటుంబ సభ్యులను కలిపారు. అచ్చం సినిమా కథను తలపించే ఈ సంఘటన బీహార్లో జరిగింది.
పాట్నాకు చెందిన గుడియా అనే అమ్మాయి ఆరేళ్ల వయసులో మేనమామతో కలసి తాతగారి ఊరు గౌహతి బయల్దేరింది. బీహార్లోని బరౌనీ రైల్వే స్టేషన్లో తినుబండారాలు కొనేందుకు దిగిన గుడియా మేనమామ మళ్లీ రైలును అందుకోలేకపోయాడు. దీంతో ఒంటరయిన గుడియా భయంభయంగా గౌహతి చేరింది. రైల్వే పోలీసులు విచారించగా గుడియా తన అడ్రస్, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పలేకపోయింది. కాకపోతే పాట్నాలో తన ఇంటికి ఎదురుగా ఉన్న బిస్కట్ ఫ్యాక్టరీలో మేనమామ పనిచేస్తాడని మాత్రం గుర్తుంది. ఈ చిన్న జ్ఞాపకం ఆధారంతో అడ్రెస్ తెలుసుకోవడం కష్టమైంది. పోలీసులు ఆమెను చిల్డ్రన్స్ హోమ్లో చేర్చారు.
గుడియా అసోంలోనే పెరిగి పెద్దయ్యింది. అక్కడే వివాహం చేసుకుంది. అయితే తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్లడం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. తను తప్పిపోయినపుడు హింది మాత్రమే తెలుసు. అసోం వెళ్లాక హింది మరిచిపోయింది. ఇప్పుడు గుడియాకు అస్సామీ తప్ప మరే బాషా రాదు. గత నెలలో గుడియా భర్తను తోడుతీసుకుని తల్లిదండ్రుల వెదుక్కొంటూ పాట్నా వెళ్లింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. అసోం పిల్లల సంరక్షణ సొసైటీలో పనిచేసే నీలాక్షి శర్మ అనే అధికారి గుడియా అన్వేషణలో సాయపడ్డారు. నీలాక్షి.. గుడియా కుటుంబ సభ్యుల చిరునామా తెలుసుకునేందుకు గూగూల్లో శోధించడం మొదలుపెట్టారు. పాట్నాలో తన ఇంటి ముందున్న బిస్కట్ల ఫ్యాక్టరీలో మేనమామ పనిచేస్తున్న విషయం గుడియాకు గుర్తుకువచ్చింది. ఈ విషయం నీలాక్షి చెప్పగా నెట్లో అన్వేషించారు. ఎట్టకేలకు ఓ బలమైన ఆధారం దొరికింది. బిస్కట్ల ప్యాక్టరీ ఫోన్ నెంబర్ గూగుల్లో దొరికింది. ఈ ఫోన్ నెంబర్ ద్వారా గుడియా మేనమామను, ఆ తర్వాత తల్లిదండ్రుల వివరాలు తెలుసుకున్నారు. గత సోమవారం గుడియా తల్లిదండ్రులు గౌహతి వెళ్లి ఆమెను కలుసుకోవడంతో కథ సుఖాంతమైంది.