అప్పటి పాక్ ప్రధాని మా ఇంటికొచ్చారు: హెడ్లీ
ముంబై: ముంబై బాంబు పేలుళ్లు జరిగిన కొన్నివారాల తర్వాత అప్పటి పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ తన ఇంటికి వచ్చారని 26/11 ఘటనలో అప్రూవర్‌గా మారిన డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ముంబై ప్రత్యేక కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షికాగో జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాది హెడ్లీని విచారిస్తున్న నేపథ్యంలో మూడోరోజైన శుక్రవారం అతను ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘ముంబైలో దాడులు జరిగిన నెల తర్వాత మా నాన్న సయ్యద్ సలీం చనిపోయారు.
అయితే ఆయన అంత్యక్రియలకు అప్పటి పాక్ ప్రధాని గిలానీ వచ్చారనడం అవాస్తవం. మా నాన్న మరణించిన కొన్ని వారాల తర్వాత గిలానీ పాక్‌లో ఉన్న మా ఇంటికి వచ్చి పరామర్శించారు. లష్కరేతో నాకు సంబంధాలుండటం నాన్నకు ఇష్టం ఉండేది కాదు’ అని హెడ్లీ చెప్పాడు. తనకు చిన్నప్పటి నుంచీ భారత్ అంటే ద్వేషమన్నాడు. 1971లో భారత్-పాక్ యుద్ధంలో తాను చదువుకుంటున్న స్కూల్‌పై భారత్ బాంబు దాడికి పాల్పడగా.. పలువురు ప్రాణాలు చనిపోయారని, అందుకే భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతోనే లష్కరేలో చేరానన్నాడు.