ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలాని కరోనా వైరస్(కోవిడ్-19) బారిన పడ్డారు. శనివారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ నేపథ్యంలో యూసఫ్ రజా గిలాని తనయుడు కాసీం గిలానీ.. ‘‘మా నాన్న ప్రాణాలను విజయవంతంగా ప్రమాదంలో పడేసిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ)కు ధన్యవాదాలు. ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ ఫలితం వచ్చింది’’ అంటూ ట్విటర్ వేదికగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూసఫ్ రజా గిలానీ గురువారం రావల్పిండిలో ఎన్‌ఏబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేనని.. ఈ విషయంలో తనకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని అంతకుముందు న్యాయమూర్తికి విన్నవించారు. అయితే జడ్జికి ఇందుకు నిరాకరించడంతో ఆయన స్వయంగా ఎన్‌ఏబీ ఎదుట హాజరయ్యారు. (పాక్ క్రికెట్‌లో కరోనా కలకలం)
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఆయన తనయుడు కాసీం గిలానీ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో గిలానీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన సయ్యద్ యూసఫ్ రజా గిలాని 2008 నుంచి 2012 వరకు పాక్ 18వ ప్రధానిగా కొనసాగారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆయన ప్రధాని పదవికి అర్హుడు కాదంటూ తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 1,32,405కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 2551 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఇక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే.
Thank you Imran Khan’s govt and National Accountibilty Burearu! You have successfully put my father’s life in danger. His COVID-19 result came postive. pic.twitter.com/VxiEXFOkZA
— Kasim Gilani (@KasimGillani) June 13, 2020
Comments
Please login to add a commentAdd a comment