మాజీ పీఎం కొడుకు కిడ్నాప్ సుఖాంతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ కుమారుడు అలీ హైదర్ గిలానీ కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. అప్ఘానిస్థాన్ లో తాలిబాన్ తీవ్రవాదుల చెర నుంచి అతడిని మంగళవారం విడిపించారు. ఘాజ్ని ప్రావిన్స్ లో అమెరికా, అప్ఘానిస్థాన్ సైనిక బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అతడిని విడిపించినట్టు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మూడేళ్ల క్రితం హైదర్ గిలానీ కిడ్నాపయ్యాడు. ముల్తాన్ లో 2013, మే 9న సాయుధులు అతడిని కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన దాడిలో అతడి ఇద్దరు అనుచరులను దుండగులు కాల్చిచంపారు. కిడ్నాప్ కు గురైన సమయంలో సాధారణ ఎన్నికల్లో ముల్తాన్ అభ్యర్థిగా ఆయన ఉన్నారు. హైదర్ గిలానీకి విముక్తి లభించిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) బిలావల్ భుట్టో జర్దారి ట్విటర్ ద్వారా తెలిపారు. తన కుమారుడి విడుదల గురించి యూసఫ్ రజా గిలానీకి అప్ఘానిస్థాన్ లోని పాక్ రాయబారి ఫోన్ చేసి చెప్పారు.