'షీనా హత్య ప్రతి కదలిక ఆయనకు తెలుసు'
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు అవాక్కయ్యే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్వయంగా తానే కన్న కూతురుని చంపించినట్లు ఒప్పుకోగా.. ఆ వరుసలో త్వరలోనే ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా కూడా చేరనున్నారు. షీనా హత్యకు సంబంధించిన ప్రతి చిన్న విషయం పీటర్ కు ముందే తెలుసని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.
తనకు బెయిల్ ఇవ్వాలంటూ పీటర్ ముఖర్జియా సీబీఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి కూడా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ అధికారుల తరుపు న్యాయవాది భరత్ బాదామి కోర్టుకు ఏం చెప్పారంటే..
'షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా కీలక పాత్ర పోషించారు. హత్యకు సంబంధించిన ప్రతి కదలిక పీటర్ కు తెలుసు. హత్య జరగడానికి ఒక రోజు కూడా పీటర్ కు ఇంద్రాణి ఫోన్ చేసింది. 686 సెకన్లు(దాదాపు 11 నిమిషాలు పైగా) మాట్లాడింది. హత్య ప్రణాళికను ఎలా పూర్తి చేయాలని వారు డిస్కస్ చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంద్రాణి ఆయనకు తెలియజేసింది' అని వెల్లడించారు. గతంలో కూడా పీటర్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.