'మా నాన్న అమాయకుడు.. ఆయనకేం తెలియదు'
ముంబయి: తన తండ్రి పీటర్ ముఖర్జియా అమాయకుడని, ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని షీనా బోరా హత్య కేసుకు సంబంధించి పీటర్ ముఖర్జియా తనయుడు రాహుల్ ముఖర్జియా అన్నాడు. గత శుక్రవారం సీబీఐ అధికారులు హత్య, నేర పూరిత కుట్ర ఆరోపణల పేరిట పీటర్ ముఖర్జియాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కొందరు మీడియా అధికారులు రాహుల్ ను సంప్రదించగా అతడు ఈ విధంగా స్పందించాడు.
'షీనా హత్యకు గురికావడానికి మా నాన్న ఎందుకు కారణం కాదో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే కేసు విచారణలో ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. మా నాన్న అమాయకుడు ఆయనకు ఏమీ తెలియదు' అని రాహుల్ అన్నాడు. కీలక వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక వివరణలు ఇవ్వడంతోపాటు, చాలా ఆధారాలు విచారణ అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా తనకు నగరంలో మూడు బెడ్రూంల ఫ్లాట్ ఇవ్వకుంటే తాను ఇంద్రాణి సోదరిని కాదని, ఇంద్రాణి కూతురునని అందరికీ చెప్తానని తల్లి ఇంద్రాణిని షీనా బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు తెలిసింది. ఇంద్రాణి ముఖర్జియా కుమార్తె అయిన షీనాతో రాహుల్ సంబంధం నెరిపాడన్న విషయం ఇప్పటికే తెలిసిందే.