చర్చ జరగాలి.. గొడవ కాదు | The debate should not fight | Sakshi
Sakshi News home page

చర్చ జరగాలి.. గొడవ కాదు

Published Wed, Feb 24 2016 1:11 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

చర్చ జరగాలి.. గొడవ కాదు - Sakshi

చర్చ జరగాలి.. గొడవ కాదు

పార్లమెంటు సమావేశాలపై రాష్ట్రపతి ప్రణబ్
♦ అధికార, విపక్షాలకు పరస్పర సహకారం అవసరం
♦ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం; కేంద్ర పథకాలపై ప్రశంసలు
 
 న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గొడవలు చేయటం ఆపి.. ఆరోగ్యకరమైన చర్చ జరిగేలా విపక్షాలు సహకరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రజల మనోభావాలను ప్రతిబింబించాల్సిన పార్లమెంటులో వివాదాలు జరగటం సరికాదన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా సెంట్రల్‌హాల్‌లో ఉభయ సభలనుద్దేశించి ప్రణబ్ ప్రసంగించారు. ఇటీవలికాలంలో పార్లమెంటును విపక్షాలు స్తంభింపచేయటంపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు.

ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. సభ్యులంతా పరస్పర సహకారంతో.. సభను ప్రజాసమస్యలపై చర్చకు వినియోగించుకోవాలని ప్రణబ్ కోరారు. రాజ్యసభలో ప్రభుత్వానికి వీలైనంత మెజారిటీ లేకపోవటం వల్లే ఇంత రాద్ధాంతం జరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. సభాకార్యక్రమాలను విపక్షాలు అడ్డుకోవటంపై మాట్లాడినపుడు సభ చప్పట్లతో మార్మోగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు, బ్యాంకుల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రశంసించారు.

 వారూ వీరూ కలసి.. కాగా, రాష్ట్రపతి ప్రసంగం కోసం ఏర్పాటుచేసిన సమావేశంలో.. సోనియా గాంధీ, అద్వానీ పక్క పక్కన కూర్చోగా.. రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒకచోట కూర్చుని మాట్లాడుతూ కనిపించారు. ప్రధాని మోదీతో అరుణ్ జైట్లీ, రాజ్యసభ విపక్షనేత గులాంనబీ ఆజాద్ కలసి కూర్చున్నారు.

 రాష్ట్రపతి ప్రసంగంలోని పలు ముఖ్యాంశాలు..
► పేదరిక నిర్మూలనకు కట్టుబడిన మోదీ ప్రభుత్వం ఈ దిశగా పలు పథకాలను చేపట్టింది.
► నల్లధనం వెనక్కు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి.
► జన్‌ధన్ యోజన ద్వారా తెరిచిన అకౌంట్లతో.. ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు చేసే ఆర్థికసాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే వెళుతుంది.
► ప్రధాన మంత్రి ముద్రయోజన కింద 2.6 కోట్ల మందికి లక్షకోట్ల నిధులిచ్చారు. ఇందులో 2.07 కోట్ల మంది వ్యాపారులు మహిళలే.
► నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను పునరుజ్జీవింపచేసేందుకు 70 వేల కోట్ల రూపాయల సాయం అందించింది.
► ప్రపంచ ఆర్థిక రంగం కష్టాల్లో ఉన్నా.. భారత ఆర్థిక పరిస్థితి మాత్రం చెక్కుచెదరలేదు. మోదీ సర్కారు అవలంబించిన కార్యక్రమాలే దీనికి కారణం.
► సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేస్తూనే..పాకిస్తాన్‌తో స్నేహపూర్వక వాతావరణాన్ని భారత్ కోరుకుంటోంది.
► పఠాన్‌కోట్ ఘటనలో ఉగ్రవాదులను అడ్డుకుని భారీనష్టం జరగకుండా ఆపిన సైనికులకు శుభాకాంక్షలు. పలుప్రభుత్వ పథకాలపైనా రాష్ట్రపతి సానుకూలంగా వ్యాఖ్యానించారు.
 
 సభ సజావుగానే: ప్రధాన మంత్రి

 పార్లమెంటు సమావేశాలను అడ్డుకునేందుకు విపక్షాలు సిద్ధమవుతోంటే ప్రధాని మోదీ మాత్రం సమావేశాలు ప్రశాంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సభలో ప్రజాప్రయోజనకరమైన చర్చ జరుగుతుందని ఇందులో విపక్ష  సభ్యులు సానుకూల అంశాలను ప్రభుత్వానికి సూచించే పరిస్థితి కనబడుతోందని  అన్నారు. రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున 125 కోట్ల ప్రజలు పార్లమెంటులో ఏం జరుగుతుందో చూద్దామనుకుంటున్నందున విపక్షాలు సహకరిస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement