పాక్ ‘బలం’ వెనుక డ్రాగన్ పడగ
చైనా తయారు చేస్తున్న ఆయుధాల్లో 35 శాతం పాక్‌కే..
‘భారత్‌తో యుద్ధానికి వెనుకాడబోం’.. ‘మా దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఆట బొమ్మలేం కాదు..!’.. ‘భారత్ దాడికి బదులిస్తాం’.. పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి అనంతరం, అంతకుముందు పాక్ చెప్పిన మాటలివి. నిజానికి భారత్‌తో యుద్ధం చేసేంత బలం పాక్‌కు ఉందా..? ఉంటే ఆ బలం ఎక్కడిది? యుద్ధం, యుద్ధం.. అంటూ పాక్ ఎగిరెగిరి పడుతుండటానికి ముఖ్య కారణం డ్రాగన్ చైనా. గత ఐదేళ్లలో చైనా-పాక్ మధ్య పెనవేసుకున్న ‘ఆయుధ బంధం’ ఈ విషయాన్ని వెల్లడిచేస్తోంది.
న్యూఢిల్లీ: ఐదేళ్ల కిందటి వరకు పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరాను అమెరికా, చైనా దాదాపు ఒకే నిష్పత్తిలో చేసేవి. ఆ మేరకు అమెరికా, చైనా 39:38 శాతం ఆయుధాలను సరఫరా చేయగా.. ప్రస్తుతం చైనా 63 శాతానికి సరఫరాను పెంచగా, అమెరికా 19 శాతం మాత్రమే చేస్తోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆయుధాల ఎగుమతిదారుగా చైనా అవతరించడంలో పాక్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటం కూడా ముఖ్య కారణంగా కనిపిస్తోంది. స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక సంస్థ (ఎస్‌ఐపీఆర్‌ఐ) ఫిబ్రవరిలో వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనా ఉత్పత్తి చేస్తున్న ఆయుధాల్లో 35 శాతం కొనుగోలు చేస్తూ పాక్ తొలి స్థానంలో ఉంది.
చైనా నుంచి పాక్ ఆయుధ దిగుమతులు ఇలా
► గత నెలలో సుమారు రూ.25,600-33,200 కోట్ల విలువైన 8 డీజల్-ఎలక్ట్రానిక్ సబ్‌మెరైన్లను కొనుగోలు చేసేందుకు చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పాక్ రక్షణ శాఖ తెలిపింది. ఇది చైనాకు అతిపెద్ద రక్షణ ఎగుమతి ఒప్పందం.
► 250 నుంచి 300 జేఎఫ్-17 యుద్ధ విమానాలను చైనా, పాక్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇవి పాక్ వైమానిక దళానికి వెన్నెముకగా నిలవనున్నాయి. ఈ జేఎప్-17 విమానాలను కొనుగోలు చేసేందుకు పాక్‌తో నైజీరియా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు సమాచారం.
► 500-750 మిలియన్ డాలర్ల విలువైన జుల్ఫి క్వార్ క్లాస్ యుద్ధ నౌకలు 4. అందులో 3చైనాలో, ఒకటి కరాచీలో తయారయ్యాయి.
► 8 సీ802 నౌక విధ్వంసక క్షిపణులతో కూడిన అజ్మాట్ క్లాస్ క్రాఫ్ట్‌లు 4. ఇందులో 3 పాక్‌లోనే తయారయ్యాయి.
► పాక్ ఆర్మీ ఆధ్వర్యంలో 600 ఏ1 ట్యాంకులు పాకిస్తాన్‌లో తయారయ్యాయి. ఇవి చైనా 90-11 ట్యాంకులను పోలి ఉంటాయి.
► ఉపరితలం నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే హెచ్‌క్యూ-16 మధ్య స్థాయి క్షిపణి వ్యవస్థలు తొమ్మిది. వీటి వ్యయం సుమారు 600 మిలియన్ డాలర్లు.
► మొత్తంగా 2011 నుంచి 2015 మధ్య చైనా 8.4 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను సరఫరా చేసి మూడోస్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో అమెరికా (47 బిలియన్ డాలర్లు), రష్యా (36 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.
► 2006-10లో 3.6 శాతం పెరిగిన చైనా ఆయుధ ఎగుమతి మార్కెట్.. 2011-2015 నాటికి 5.9 శాతం పెరిగింది.