కాలపరిమితి సరికాదు
జడ్జీల పదవులపై నూతన సీజేఐ జస్టిస్ లోధా 41వ చీఫ్ జస్టిస్‌గా ప్రమాణం
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవులకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలన్న వాదనతో సుప్రీంకోర్టు నూతన చీఫ్ జస్టిస్ రాజేంద్రమల్ లోధా విభేదించారు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం అమల్లో ఉన్న కొలీజియం విధానం కొనసాగింపునకే ఆయన మద్దతు పలికారు. ఆదివారం రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు 41వ సీజేఐగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ లోధా చేత ప్రమాణం చేయించారు. అనంతరం జస్టిస్ లోధా మీడియాతో మాట్లాడారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలకే కట్టుబడకుండా కొలీజియంతో సంబంధంలేని వ్యక్తులనూ విస్తృతంగా సంప్రదించాలన్నారు. సీజీఐ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలం నిర్దిష్టంగా రెండేళ్లు కాలపరిమితి ఉండాలన్న మాజీ సీజేఐ జస్టిస్ పి.సదాశివం అభిప్రాయంతో విభేదించారు. ఇలాంటి గడువు పెడితే తదుపరి సీజేఐ కావాల్సిన సీనియర్ న్యాయమూర్తులపై ఆ ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఉన్నవారిని న్యాయమూర్తులుగా నియమిస్తే న్యాయవ్యవస్థ సవ్యంగా పనిచేస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవుల భర్తీకి తాను ప్రథమ ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఈ నియామకాల్లో అత్యంత పారదర్శకత, విస్తృత సంప్రదింపుల విధానాన్ని తీసుకొస్తానని చెప్పారు. న్యాయమూర్తుల కుటుంబసభ్యులు అదే హైకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేయడంపై మీడియా ప్రశ్నకు జస్టిస్ లోధా స్పందిస్తూ... ఇలాంటి విషయాల్లో నియమావళి ఉల్లంఘన జరిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో బార్ (న్యాయవాదుల సంఘం) క్రియాశీలకంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. అయితే దురదృష్టవశాత్తూ బార్ తన పాత్రను సమర్థంగా పోషించకపోవడం వల్ల న్యాయమూర్తులపై నింద పడుతోందన్నారు.
న్యాయవ్యవస్థకు, ప్రభుత్వంలోని ఇతర వ్యవస్థలకు మధ్య ఘర్షణపూరిత వాతావరణంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... వాటికి నిర్దేశించిన హద్దులను మీరకుండా పనిచేసుకుంటూ వెళ్తే అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని అభిప్రాయపడ్డారు. కాగా, సీజేఐగా జస్టిస్ లోధా ఐదు నెలల పాటు (సెప్టెంబర్ 27 వరకూ) సేవలందిస్తారు. బొగ్గు గనుల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు.