గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇక ఆన్‌లైన్లో చెల్లించొచ్చు!
వంటగ్యాస్ కనెక్షన్లకూ ఈఎంఐ!
ముంబై: వంటగ్యాస్ సిలిండర్ రీఫిలింగ్ కోసం బుక్ చేసుకున్నప్పుడే డబ్బులు కూడా చెల్లించేలా ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఆన్‌లైన్లో బుక్ చేసుకునే సదుపాయం మాత్రమే ఉండేది. డబ్బులు మాత్రం సిలిండర్‌ను తెచ్చిన డెలివరీ బోయ్స్‌కు ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై సిలిండర్‌ను బుక్ చేసుకున్న సమయంలోనే, ఆన్‌లైన్లో రీఫిలింగ్ డబ్బులనూ చెల్లించవచ్చు. ఎల్పీజీ సిలిండర్ రీఫిలింగ్ కోసం చెల్లించే మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యాన్ని ఆదివారం కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముంబైలో ప్రారంభించారు.
‘ప్రభుత్వ రంగ సంస్థలైన చమురు మార్కెటింగ్ సంస్థలు ఆన్‌లైన్ చెల్లింపు విధానాన్ని ప్రారంభించాయి’ అని ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఆన్‌లైన్ చెల్లింపు సదుపాయాన్ని www.mylpg.in వెబ్‌సైట్ ద్వారా, 13 భాషల్లో పొందవచ్చు. అన్ని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ బుక్ చేసుకుని, డబ్బులు చెల్లించేలా టచ్ పాయింట్లను ఏర్పాటు చేసే విషయమూ ఆలోచిస్తున్నామని ప్రధాన్ తెలిపారు. వినియోగదారులకు వంటగ్యాస్ కనెక్షన్ల వ్యయాన్ని సమాన నెలసరి వాయిదాల(ఈఎంఐ) ద్వారా చెల్లించే అవకాశం కల్పించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) యోచిస్తున్నాయని వెల్లడించారు. వినియోగదారులు తమ కొత్త ఎల్పీజీ కనెక్షన్ ఖర్చు రూ. 3,400లను గరిష్టంగా 24 సమాన వాయిదాల్లో చెల్లించే ప్రతిపాదనపై ఓఎంసీలు కసరత్తు చేస్తున్నాయన్నారు.