‘ఎల్పీజీ సబ్సిడీ’కి గిన్నిస్
ధ్రువపత్రం ప్రధానికి అందజేత
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ల నగదు బదిలీ పథకం గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఎల్పీజీ సబ్సిడీని ప్రపంచంలో అతిపెద్ద నగదు బదిలీ పథకంగా పేర్కొంటూ గిన్నిస్ బుక్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేసేలా గత యూపీఏ ప్రభుత్వం 2013, సెప్టెంబర్ 1న ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ పథకానికి అవాంతరాలు ఎదురవడంతో ఎన్డీఏ ప్రభుత్వం వాటిని పరిష్కరించి దాని పేరు మార్చి ‘పీఏహెచ్‌ఏఎల్ (ప్రత్యక్ష హస్తాంతరిత్ లాభ్-పహల్)’గా 2015, జనవరి 1 నుంచి అమలుచేసింది.
గత జూన్ 30 నాటికి 12.57 కోట్ల మంది ఖాతాలకు నగదు బదిలీ చేస్తూ అతిపెద్ద నగదు బదిలీ పథకంగా ‘పహల్’ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ గుర్తించిందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 2015, ఏప్రిల్ 1 నాటికి 18.19 కోట్ల మంది నమోదిత వినియోగదారులుండగా, 14.85 కోట్ల మంది క్రియాశీల వినియోగదారులున్నారని తెలిపింది. 3.34 కోట్ల మంది వినియోగదారులను నకిలీగా గుర్తించి వారి కనెక్షన్లను రద్దు చేశారని, దీంతో 2014-15లో రూ. 14,672 కోట్లు ఆదా అయిందని తెలిపింది.