అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ సేవలు అంతంతే
ఇతర అవసరాలకే ఎక్కువగా వినియోగిస్తున్న వైనం
సాక్షి, ముంబై: అత్యవసర సమయంలో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబులెన్స్ ఇతర వైద్యసేవలకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. దీంతో అత్యవసరమైనప్పుడు ఇవి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఈ అంబులెన్స్ సేవలను అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఉపయోగించాలనే అవగాహన ప్రజల్లో లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాలు, విద్యుదాఘాతం తదితర ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు వెంటనే వైద్యసేవలు అందాలనే ఉద్దేశంతో నాలుగు నెలల కిందట 108 నంబర్‌తో అంబులెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.కాని ఈ నాలుగు నెలల కాలంలో అత్యవసర సేవలకంటే గర్భిణిలే ఎక్కువ శాతం ఈ సేవలను వినియోగించినట్లు రికార్డు చేసిన గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.
వీరంతా పరీక్షల నిమిత్తం, ప్రసవానికి ఆస్పత్రులకు వెళ్లేందుకు అంబులెన్స్‌లను వినియోగించినట్లు తేలింది. కేవలం ఒక్క శాతం మాత్రమే గుండెపోటు వచ్చిన వ్యక్తి ఈ సేవలను వినియోగించినట్లు స్పష్టమైంది. నాలుగు నెలల కాలంలో 108 నంబర్‌కు సుమారు ఎనిమిది లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందులో 50 వేల కాల్స్ వైద్యం నిమిత్తం ఆస్పత్రికి వెళ్లేందుకు వినియోగించినట్లు తెలిసింది. సుమారు లక్ష కాల్స్ కేవలం సమాచారం అడిగి తెలుసుకునేందుకే చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
అంబులెన్స్ సేవల గురించి అత్యధిక శాతం ప్రజలకు తెలిసేలా జనజాగృతి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి సుజాత సోనిక్ చెప్పారు.దీంతో బస్‌స్టాపుల్లో, రైల్వే స్టేషన్లలో, బహిరంగ స్థలాల్లో అక్కడక్కడా ప్రజలను జాగృతం చేసే ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు సోనిక్ చెప్పారు. ఇప్పటిదాకా గుండె పోటుతో ఒక శాతం, ప్రమాదాలు 17 శాతం, గర్భిణీలు పరీక్షలు, ప్రసవానికి 24 శాతం, ఇతర కారణాలకు 57 శాతం వినియోగించుకున్నారు.