ఎక్కువగా దాడికి గురైన పొలిటీషియన్ ఆయనే!
ఢిల్లీ: రాజకీయాల్లోకి ఏ ముహూర్తంలో ఎంటరయ్యాడో గాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై జరిగినన్ని దాడులు ఇటీవలి కాలంలో మరే ఇతర రాజకీయ నాయకుడిపై జరగలేదు. తాజాగా శనివారం ఢిల్లీలో అమలుచేయనున్న రెండో దశ సరి-బేసి విధానంపై మాట్లాడుతున్న ఆయనపై ఓ వ్యక్తి బూటు విసిరాడు. పక్కనే ఉన్న వ్యక్తులు అడ్డుకోవడంతో అది కేజ్రీవాల్కు సమీపంలో పడింది.
గతంలో కేజ్రీపై జరిగిన దాడులను ఓ సారి పరిశీలిస్తే..
2013 నవంబర్లో అన్నా హజారే మద్దతుదారునిగా చెప్పుకున్న ఓ వ్యక్తి కేజ్రీవాల్, ఇతర ఆప్ లీడర్లపై ఇంకుతో దాడి చేశాడు. 2014 మార్చ్లో లోక్సభ ఎన్నికలకు వారణాసిలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కేజ్రీవాల్పై కొందరు దుండగులు కోడిగుడ్లు, ఇంకుతో దాడి చేశారు. అదే ఏడాది ఎప్రిల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో దక్షిణ్పురి ప్రాంతంలో ఓ వ్యక్తి కేజ్రీవాల్ వెనుక నుంచి దాడి చేశాడు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల అనంతరం ఢిల్లీలోని సుల్తాన్పురి ఏరియాలో ఓ ఆటోరిక్షా డ్రైవర్ కేజ్రీవాల్ను చెంపదెబ్బ కొట్టాడు.
ఈ ఏడాది జనవరిలో సరి-బేసి విధానం విజయవంతం అయిందంటూ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆమ్ఆద్మీ సేన కార్యకర్త భావనా అరోరా కేజ్రీవాల్పై సిరాదాడికి పాల్పడింది. 2016 ఫిబ్రవరిలో పంజాబ్లో పర్యటిస్తున్న సమయంలో కేజ్రీవాల్ కారుపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు.