నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు!
కల్యాణ్ సింగ్, వీకే మల్హోత్రా, లాల్‌జిత్ టాండన్లకు అవకాశం?
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలకు త్వరలో కొత్త గవర్నర్ల నియామకం జరగబోతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు ప్రతిపాదిత కొత్త గవర్నర్ల పేర్లను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసింది. బీజేపీ సీనియర్ నేతలు కల్యాణ్ సింగ్, వీకే మల్హోత్రా, లాల్‌జీ టాండన్‌ల పేర్లు ఉన్నట్లు భావిస్తున్నారు. గవర్నర్ల నియామకంపై రాష్ట్రపతి భవన్‌నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కాగా, తనకు రాజస్థాన్ గవర్నర్ పదవిపై ప్రతిపాదన అందిందని, ప్రతిపాదనకు సంతోషంగా అంగీకరించానని కల్యాణ్ సింగ్ ఈ నెల 11న స్వయంగా ప్రకటించారు. తనను మిజోరాం రాష్ట్రానికి బదిలీ చేసినందుకు నిరసనగా మహారాష్ట్ర గవర్నర్ శంకర నారాయణన్ ఆదివారం రాజీనామా చేయడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీ అయింది. హెచ్‌ఆర్ భరద్వాజ్ ఐదేళ్ల పదవీకాలం ముగిసిపోవడంతో కర్ణాటక గవర్నర్ పదవి, మార్గరెట్ ఆల్వా పదవీకాలం ముగిసిపోవడంతో రాజస్థాన్ గవర్నర్ పదవి, బీవీ వాంఛూ రాజీనామాతో గోవా గవర్నర్ పదవి ఖాళీ అయ్యాయి.
షీలా రాజీనామాపై ఊహాగానాలు
కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా చేయబోతున్నారన్న ఉహాగానాలు సోమవారం వెల్లువెత్తాయి. సోమవారం ఢిల్లీ చేరుకున్న షీలాదీక్షిత్ తొలుత కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ శంకర నారాయణన్ రాజీనామా చేసిన మరుసటిరోజునే షీలా దీక్షిత్ రాష్ట్రపతిని, రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. కాగా, రాజీనామాపై ఒత్తిడి ఉన్నందున షీలా దీక్షిత్ పదవినుంచి వైదొలగే అవకాశం ఉందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆమెను ఏదైనా ఈశాన్య రాష్ట్రానికి బదిలీ చేయవచ్చని కూడా వార్తలు వచ్చాయి. కాగా, గవర్నర్ల వ్యవస్థను ఎన్డీయే సర్కారు అవమానిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ తీవ్రంగా విమర్శించారు.